ఉరి కోసం అడుగులు
న్యూడిల్లీ, జనవరి 23
ఉరిశిక్ష కేసుల్లో బాధితుల కేంద్రీకృత మార్గదర్శకాలు, దోషులు తమకు అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాలను ఉపయోగించo కాలపరిమితిపై సుప్రీంకోర్టును కేంద్రం వివరణ కోరింది. ప్రస్తుతం నిబంధనలు దోషులకు అనుకూలంగా ఉండటం వల్ల చట్టంతో వారు ఆడుకుని, అమలు చేయడంలో జాప్యానికి కారణమవుతున్నాయని కేంద్రం పేర్కొంది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు జాప్యాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది.మరణశిక్ష విధించిన దోషులకు లభించే హక్కులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో మార్పు చేయాలని పిటిషనర్ కోరాడు. అంతేకాదు, ఉరిశిక్షను సమీక్షించాలని కోరుతూ దోషి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్ దాఖలకు కాలపరిమితి ఉండాలని డిమాండ్ చేశాడు. నిర్భయ కేసులో దోషులు దాఖలుచేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లను ఉరితీయాలని పాటియాల కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో దోషుల్లో వినయ్, ముఖేష్ చివరి ప్రయత్నంగా సుప్రీంను ఆశ్రయించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీరి పిటిషన్‌ను విచారించిన అనంతరం కొట్టివేసింది.ఇదిలా ఉండగా నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారంట్లు జారీ అయ్యాయి. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు ఆదేశించింది. దోషుల్లో ఒకడైన ముఖేశ్‌కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, 2012లో నేరం జరిగినప్పుడు తాను మైనర్‌నంటూ మరో దోషి పవన్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
నిందితుల లాయర్ ను జైల్లో పెట్టండి
అత్యాచార దోషులకు క్షమాభిక్ష పెట్టాలని ప్రఖ్యాత లాయర్ ఇందిరా జైసింగ్ .. నిర్భయ తల్లి ఆశాదేవిని కోరిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ కంగనా రౌనత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లాయర్ జైసింగ్‌ను నిందితులతో కలిపి నాలుగు రోజుల పాటు జైలులో బంధించాలని కంగనా కామెంట్ చేశారు. ఇందిరను వారితో బంధించడం అవసరమని, అప్పుడే ఆమెకు వాళ్లేంటో తెలుస్తుందన్నారు. అలాంటి మహిళలే ఇలాంటి రాక్షసులు, నేరగాళ్లకు జన్మనిస్తారని ఫిల్మ్ స్టార్ తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించడంతో.. నిర్భయ నిందితుల పట్ల దయ చూపాలని లాయర్ ఇందిరా జైసింగ్.. ఆదేశావిని వేడుకున్నారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన నిందితులను ఎలాగైతే సోనియా గాంధీ క్షమించిందో.. అలా క్షమాభిక్ష ప్రసాదించాలని లాయర్ ఇందిర కోరారు. దానిపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాభిక్ష కోరేందుకు నువ్వెవరు అని ఆమె ప్రశ్నించారు.