దావోస్ లో బిజీబిజీగా కేటీఆర్
న్యూఢిల్లీ, జనవరి 23:
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ తెలంగాణ లాంజ్ .. ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో.. ఆ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆర్థిక సదస్సుకు హాజరైన అనేక ప్రపంచ దేశాలు తమ పెవిలియన్లను దావోస్‌లో ఏర్పాటు చేశాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాంజ్.. ప్రపంచ మేటి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నది. వాణిజ్యవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలతో కూడిన ఓ వాల్ డిజైన్.. అక్కడికి వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర వృద్ధిని ఆ వాల్ డిజైన్‌లో చూపిన వైనం చాలా ప్రొఫెషనల్‌గా ఉంది. ఎన్నో ప్రఖ్యాత సంస్థల సీఈవోలు, అధినేతలు తెలంగాణ స్టాల్‌లో ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ అవుతున్నారు. ఇదే స్టాల్‌లో వాళ్లంతా చర్చలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 800 ఫార్మా, బయోటెక్ సంస్థలు ఉన్నాయని, వాటి వ్యాపారం సుమారు 50 బిలియన్ల డాలర్లు ఉంటుందన్న సందేశాన్ని ఓ వాల్ పోస్టర్‌లో ప్రజెంట్ చేశారు. మార్స్ గ్రహానికి ఇస్రో ఓ ఆర్బిటార్‌ను పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆర్బిటార్‌లో వాడిన సుమారు 30 శాతం పరికరాలు తెలంగాణలోనే తయారయ్యాయని మరో వాల్‌ను డిజైన్‌ను చేశారు. హైటెక్ హంగులతో డిజైన్ చేసిన తెలంగాణ స్టాల్ నిజంగానే కేక పుట్టిస్తున్నది. ఇన్వెస్ట్ తెలంగాణ బ్రౌచర్ కూడా పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు టెకీ సంస్థలు హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకున్నాయని మరో వాల్‌పోస్టర్ విజిటర్స్‌ను ఆకట్టుకుంటున్నది.