భర్తను చంపేందుకు 3 లక్షల సుపారీ
గుంటూరు, జనవరి 23 :
గుంటూరు గ్రామీణ మండలం చల్లావారిపాలెం గ్రామానికి చెందిన చెందిన ప్రత్తి బాలకృష్ణ (55) హత్య కేసును పోలీసులు చేధించారు. మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్నట్లుగా అతడి హత్యలో భార్య, కుమార్తే సూత్రధారులని తేలింది. గ్రామానికి చెందిన బాలకృష్ణకు భార్య ప్రమీలాదేవితో గత కొంతకాలంగా వివాదాలు కొనసాగున్నాయి. దీంతో ఆమె కుమార్తెతో కలిసి గుంటూరు నగరంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవల వివాదాలు తారాస్థాయికి చేరడంతో భర్తను చంపేయాలని ప్రమీల నిర్ణయించుకుంది.దీనికోసం డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న కూతురిని సాయం కోరింది. ఆ యువతి తన కాలేజీలో డిగ్రీ చదువుతున్న పెదకూరపాడుకు చెందిన అత్తలూరి గోపికృష్ణ సాయం కోరగా.. అతను అదే గ్రామానికి చెందిన చుక్కపల్లి శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించాడు. భర్తను చంపేందుకు ప్రమీల.. శ్రావణ్‌కుమార్‌కు రూ.3లక్షల సుపారీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గోపీకృష్ణ, శ్రావణ్‌కుమార్ ఈ నెల 9న చల్లావారిపాలెంలోని బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. కుమార్తె పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చామని నమ్మించి లోనికి ప్రవేశించి అతడిపై కత్తితో దాడి చేశారు.తీవ్ర రక్తస్రావంతో బాలకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమీల ప్రవర్తనపై నిఘా పెట్టారు. ఆమె కాల్స్‌డేటాను పరిశీలించగా ఎన్నో కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెతో పాటు కూతురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో హంతకులు శ్రావణ్‌కుమార్, గోపీకృష్ణను కూడా అరెస్ట్ అందరినీ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వీరిలో శ్రావణ్‌కుమార్‌పై గతంలో అనేక బైక్ చోరీల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కోసం తీసుకున్న సుపారీతో గోపీకృష్ణ బంగారపు గొలుసు, రూ.70 వేలతో ఐఫోన్ కొనుగోలు చేసినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.