నకిలీ వెబ్‌సైట్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి
ఐఆర్‌సీటీసీ హెచ్చరిక
హైదరాబాద్ జనవరి 23
;ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తన యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అచ్చం ఐఆర్‌సీటీసీని పోలిన ఓ వెబ్‌సైట్ చెలామణీలో ఉందని, దాని పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఐఆర్టీసీటీటూర్ పేరిట చెలామణీ అవుతున్న వెబ్‌సైట్ నకిలీదని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ తన వినియోగదారులకు ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపింది. ప్రయాణికులు టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చంటూ ఆ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారని, దాంతో ఐఆర్‌సీటీసీకి ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ తెలియజేసింది. కనుక ప్రయాణికులు ఆ సైట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసగాళ్ల బారిన పడి డబ్బులు నష్టపోవద్దని ఐఆర్‌సీటీసీ హెచ్చరించింది. ఇక ఈ విషయమై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, వారు ఆ వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అలాగే ప్రయాణికులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, బ్యాంకింగ్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని కూడా ఐఆర్‌సీటీసీ సూచించింది.