YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 భారీగా పడిపొయిన మద్యం అమ్మకాలు

 భారీగా పడిపొయిన మద్యం అమ్మకాలు

 భారీగా పడిపొయిన మద్యం అమ్మకాలు
ఏలూరు, జనవరి 24,
మద్యానికి బానిసలైనవారి బతుకుల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు ప్రసరిస్తున్నాయి. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో తగ్గిన మద్యం అమ్మకాలే ఇందుకు నిదర్శనం. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 20 శాతం షాపులు తగ్గించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపుల నిర్వహణ చేపట్టారు. నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు సాగిస్తుండడంతో మద్యం వినియోగం తగ్గుముఖం పట్టింది. జిల్లాలో 18 నుంచి 20 శాతం వరకు మద్యం వినియోగం తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీబీసీఎల్‌ నేతృత్వంలో మద్యం షాపులను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. అలాగే మద్యం షాపులకు పరి్మట్‌ రూమ్‌లను రద్దు చేశారు. మద్యం ఎంఆర్‌పీ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మద్యం షాపుల్లో ఫ్రిడ్జ్‌లు లేకపోవడంతో బీరుల వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది. బెల్టు షాపుల నిర్వహణను నిషేధించడం, కఠినంగా వ్యవహరించడంతో లూజు అమ్మకాలు కట్టడి చేయబడ్డాయి. బెల్టుషాపుల నిర్వాహకులు సుమారు 800 మందిని ఎక్సైజ్‌ శాఖ బైండోవర్‌ చేసింది.2018లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలు, 2019లో ప్రభుత్వం మద్యం షాపులు ప్రారంభమైన తరువాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలను పోల్చి చూస్తే కేవలం మూడు నెలలకే 18 శాతం మద్యం వినియోగం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2018లోని పై మూడు నెలల్లో జిల్లాలో 9,12,206 మద్యం కేసులు అమ్ముడు కాగా, 2019లో ఇదే మూడు నెలల్లో 7,50,192 మద్యం కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే మూడు నెలలను పోల్చి చూస్తే 1,62,014 మద్యం కేసుల అమ్మకాలు తగ్గాయి. ఇక బీర్లు అయితే 70 శాతం అమ్మకాలు తగ్గాయి.2018 అదే మూడు నెలల్లో 5,04,844 బీరు కేసుల అమ్మకాలు జరగ్గా, 2019 అదే నెలల్లో కేవలం 1,56,303 కేసులు అమ్ముడయ్యాయి. అంటే మూడు నెలల్లో 3,48,541 కేసులు అమ్మకాలు తగ్గాయి. మద్యం షాపుల్లో సిట్టింగ్‌లు లేకపోవడం, ఫ్రిడ్జ్‌ సౌకర్యం లేకపోవడంతో బీర్లు వినియోగం తగ్గింది. 20 శాతం మద్యం షాపులు ఏటా తగ్గింపులో భాగంగా జిల్లాలో 377 షాపులు మాత్రమే అనుమతివ్వగా, ప్రస్తుతం 375 షాపులు నిర్వహిస్తున్నారు. చించినాడలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడ, చిట్టవరంలో కోర్టు కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల ఆ రెండు చోట్ల షాపులు లేవు. గతంలో 474 షాపులు ఉండేవి.మద్యం వినియోగం తగ్గించడంతో పాటు నాటుసారా, అక్రమ మద్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వైపు మద్యం అక్రమంగా రవాణా జరగకుండా రాష్ట్ర సరిహద్దులో 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే నాటు సారా తయారీ, అమ్మకాలపై విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. బెల్లపు ఊటలు ధ్వంసం, నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలు చేసేవారిపై, బెల్టుషాపులపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మద్యం వినియోగం తగ్గి  ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది.

Related Posts