పోలీస్ బాస్ లపై నిఘా
హైద్రాబాద్, జనవరి 24,
అవినీతి అధికారులపై పోలీస్ బాసులు నిఘా పెట్టారు. పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు సీపీ అంజనీకుమార్ కు అందించే ఫీడ్ బ్యాక్, ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సిటిజన్ల నుంచి ఐటీ సెల్ తో పాటు వాట్సప్,ట్విట్టర్,ఫేస్ బుక్, డైరెక్ట్ గా సీపీ అంజనీకుమార్ కి వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిగురించి ట్విట్టర్,ఫేస్ బుక్ లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బ్లూ కోల్ట్స్ నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించిన జూబ్లీహిల్స్ మాజీ ఇన్ స్పెక్టర్ బల్వంతయ్య, ఎస్సై సుధీర్ రెడ్డి ఏసీబీ కేసుపై సీపీ అంజనీకుమార్ సీరియస్ గా స్పందించారు. ఐదు జోన్లలోని సిబ్బందిపై ఇప్పటికే వచ్చిన ఆరోపణలు,ఫిర్యాదుల ఆధారంగా అవినీతి అధికారుల చిట్టాను ప్రిపేర్ చేస్తున్నారు. అందుకోసం సిటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అవినీతికి ఎక్కువ అవకాశాలు ఉంటే వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ తో పాటు పంజాగుట్ట, నార్త్ జోన్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్స్ సిబ్బందిపై నిఘా పెట్టినట్లు తెలిసింది.ఏడాది కాలంగా విధుల్లో నిర్లక్ష్యం,అవినీతి,నేరస్థులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు సిటీ పోలీసులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ స్టేషన్ బెయిల్ ఘటనతో పాటు పంజాగుట్ట పీఎస్ పరిధిలో నిత్యం పోలీసులపై ఫిర్యాదులు అందుతున్నాయి. కీలకమైన కేసుల్లో స్థానిక సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో లిస్బన్ పబ్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో పాటు చైన్నై మహిళ ఆత్మహత్య కేసు, నిమ్స్ డాక్టర్ల ఆపరేషన్ లో పాతబస్తీ యువతి కడుపులోని బుల్లెట్ కేసులో నిర్లక్ష్యం వహించారని పంజాగుట్ట పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్.హెచ్.ఓ పి. కరుణాకర్ రెడ్డితో పాటు ఎస్ఐలు ఐ.చంద్రశేఖర్, డి.శ్రీకాంత్ గౌడ్,షేక్ షఫిను సీపీ ట్రాన్స్ ఫర్ చేశారు. ఇలా అవీనితి ఆరోపణలతో పాటు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది డేటాను రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ఫేస్ బుక్,ట్విట్టర్,వాట్సప్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పోలీసులపై ఇచ్చే ఫిర్యాదులపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఎస్పీ నివేదికలతో పాటు బాధితులు అందించే సాక్ష్యాధారాల ఆధారంగా సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఏసీబీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐల ప్రాసిక్యూషన్ కి తీసుకోవలసిన గైడ్ లైన్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం