మలుపులు తిరుగుతున్న అమీనాపూర్ అత్యాచారం కేసు
హైద్రాబాద్, జనవరి 24
పటాన్‌చెరు సమీపంలోని అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం కేసు మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు తేల్చారు. వైద్య పరీక్షలో రేప్ జరగలేదని తేలింది. పోలీసుల విచారణలోనూ తనపై అత్యాచారం జరగలేదని బాలిక తెలిపినట్లు సమాచారం. విచారణలో బాలిక పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.మైనర్ బాలిక ను ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అమీన్‌పూర్ పోలీసులకుఫిర్యాదు అందింది. స్థానిక కిరాణా షాప్‌లో సరకులు తీసుకురావడానికి వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు నిలదీయగా కట్టుకథ చెప్పినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లు చెప్పడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. బాధితురాలి తండ్రిది ఏపీలోని శ్రీకాకుళం జిల్లాగా తెలుస్తోంది. అమీన్‌పూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్ డ్యూటీ చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.