.రామోజీరావు కుంభకోణంపై సుప్రీం విచారణ
జనవరి 24
అవిభక్త హిందూ కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద ఏర్పాటు అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల స్వీకరణ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పార్టీ గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తదుపరి విచారణ ప్రారంభించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేశారని వివాదం ఉంది.మార్గదర్శి ఫైనాన్షియర్స్ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. అనంతరం మార్గదర్శి కేసుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ కుమార్ మీడియా కు వెల్లడించారు.చట్టం ముందు అందరూ సమానులేనని, ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చుకొని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేయాలన్న మా విజ్ఞప్తిని న్యాయస్థానం స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ.2300 కోట్ల వసూలు చేశారు.దీనిపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనపై వ్యక్తిగతంగా కక్షగట్టారని ఆరోపిస్తూ.. రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజశేఖర్‌రెడ్డి పేరును వాడటానికి వీల్లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరు వాడాలని సూచించింది. అనంతరం కేసుపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో సవాలు చేశాము.నేను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు మంచి ఉత్తర్వులు ఇచ్చిందని ఉండవెల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, నాటి విచారణాధికారి కృష్ణంరాజును ఈ పిటిషన్‌లో పార్టీలుగా చేశారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలి. కేసులో దోషిగా తేలితే, రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భారీ జరిమానా విధిస్తుంది. వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉంది. దానితో పాటు రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయి’ అని తెలిపారు.