తరగతి గదులలో పోలీసులు..ఆరు బయట విద్యార్ధులు
రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయింది:చంద్రబాబు
అమరావతి, జనవరి 24
అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామం పాఠశాలలో తరగతి గదులను పోలీసులు ఆక్రమించారు. విద్యార్ధులను బైటకు పంపడంపై మీడియాకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాఠశాలకు వెళ్లారు. తరగతి గదుల్లో ఆరేసిన పోలీసుల దుస్తులను ఫొటోలు తీశారు, ఛానళ్లలో ప్రసారం చేశారు. దానిపై అక్కసుతోనే ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పోలీసులు పెట్టారు.మీడియాపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట. మీడియా గొంతు నులిమే నియంత పోకడలను ఖండిస్తున్నాం. గత 8నెలలుగా రాష్టంలో సీఎం జగన్ నిరంకుశ పాలన. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ అణిచివేత చర్యలను గర్హిస్తున్నాం అన్నారు ప్రతిపక్షనాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు. అసెంబ్లీ ప్రసారాలకు 3 ఛానళ్లపై నిషేధం విధించారని, జీవో 2430తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారని ఆయన అన్నారు.రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియా మనుగడకే ముప్పు తెచ్చారని చంద్రబాబునాయుడు అన్నారు. వైసిపి దుశ్చర్యలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన కోరారు. గత 37 రోజులుగా రాజధానిలో రైతులు, మహిళలు, రైతుకూలీలపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఆడబిడ్డల కడుపులో బూటుకాళ్లతో తొక్కారని, రాత్రివేళ పోలీస్ స్టేషన్లలో మహిళలను అక్రమంగా నిర్బంధించారని ఆయన అన్నారు.