.ఏపీలో ఏసీబీ దాడులు..అవినీతి పరుల గుండెల్లో రైళ్లు
విజయవాడ, జనవరి 24
శుక్రవారం ఉదయం తెలతెలవారుతుండగానే... ఏపీలోని ఏదో ఓ జిల్లాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని వార్త టీవీల్లో కనిపించింది. అయితే ఇదేమీ అంత పెద్ద వార్త కాదు కదా. వెరీ కామనే కదా అనుకున్నాం. అయితే మరికాసేపటికి ఏపీలోని ఇంకో జిల్లాలోని మరో తహశీల్దార్ కార్యాలయంపైనా ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయని వార్త. ఇంకాసేపటికి ఇంకో జిల్లా ఇంకో తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు... మరికాసేపటికి ఇంకో జిల్లా ఇంకో తహశీల్దార్ కార్యాలయం... ఉదయం 11 గంటల సమయానికంతా... రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలోని ఒకటో - రెండో - మూడో - నాలుగో తహశీల్దార్ కార్యాలయాలు... మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు. సరే.. ఇది శుక్రవారం మాట. ఓ నాలుగు రోజుల క్రితం ఇలాగే దాదాపుగా ఏపీలోని అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన రిజిస్ట్రార్ - సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపైనా ఏసీబీ దాడులు. అదేంటీ... ఏసీబీకి ఇంత ఫోర్స్ ఎక్కడిది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసే యంత్రాంగం ఆ శాఖకు ఎక్కడిది? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే శుక్రవారం నాడు కూడా ఏపీవ్యాప్తంగా ఏసీబీ దాడులు అనగానే... మొన్న రిజిస్ట్రార్ కార్యాలయాలపై జరిగిన దాడులు మరోమారు గుర్తుకు వచ్చాయి. వెరసి... ఏసీబీకి కొత్త శక్తి వచ్చిందని అర్థమైంది. ఇకపై అవినీతిపరుల ఆటలు చెల్లవనీ తెలిసిపోయంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు... పేరు వింటేనే నేరస్తుల వెన్నులో వణుకు పుడుతుంది. నేరస్తులేనా?... కాస్తంత బ్యాడ్ రికార్డ్ ఉన్న పొలిటీషియన్లు కూడా ఈ పేరు వింటే జడుసుకుంటారు. అలాంటి పీఎస్ఆర్... అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉంటే... అవినీతికి పాల్పడే ప్రభుత్వ శాఖల అధికారులకు దినదినగండమే. నిజమే... ఇప్పుడు ఏపీలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పీఎస్ ఆర్ ఇటీవలే బాధ్యతలు చేపట్టటగా... ఏసీబీకి గతంలోనూ లేనంత మేర శక్తి వచ్చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న పీఎస్ఆర్ ను జగన్ సీఎం కాగానే... ఏరికోరి మరి రాష్ట్రానికి పిలిపించుకున్నారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన పీఎస్ ఆర్ ను మొన్నటిదాకా ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా పనిచేయించిన జగన్... ఇటీవలే ఏసీబీ డీజీగా కొత్త బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడాలంటేనే జడుసుకుని చావాలంటూ జగన్ ఓ రేంజిలో అవినీతి నిరోధక విధానాన్ని ప్రకటించారు. సీఎంగా జగన్ ప్రకటిస్తేనే సరిపోదు కదా... అవినీతి నిరోధక శాఖను పరుగులు పెట్టించి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే అధికారులు కూడా కావాలి కదా. అందుకే... తన ఆశయం సిద్ధించాలంటే పీఎస్ ఆర్ లాంటి అదికారే ఏసీబీ చీఫ్ గా ఉండాలని జగన్ కోరారు. అనుకున్న వెంటనే పీఎస్ ఆర్ కు ఆ బాధ్యతలు అప్పగించేశారు. ఈ పని చేయడానికి కాస్తంత ముందుగా ఏసీబీతో సమీక్షలో భాగంగా ఆ శాఖ పనితీరుపై సమీక్షించిన జగన్... తన మాటకు ఆ శాఖ చేస్తున్న పనికి అసల పొంతన కుదరడం లేదని తేలిపోయింది. నాడు ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ను జగన్ అప్పటికప్పుడే బదిలీ చేసేశారు. ఆ స్థానంలో పీఎస్ఆర్ కు పోస్టింగ్ ఇచ్చేశారు. ఇంకేముంది... జగన్ తన మనసులోని మాటను పీఎస్ ఆర్ కు చెప్పేశారు. స్పందనలో అవినీతిపై వచ్చే ప్రతి ఫిర్యాదును కూడా ఏసీబీకే పంపుతానని కూడా పీఎస్ ఆర్ కు జగన్ చెప్పారట. జగన్ ఇచ్చిన భరోసాతో రంగంలోకి దిగిన పీఎస్ ఆర్... రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోందన్న విషయంపై సమగ్ర వివరాలు తెప్పించుకున్నారట. ఆ తర్వాత అసలు సిసలు యాక్షన్ ను స్టార్ట్ చేసిన పీఎస్ ఆర్... ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేయించారు. ఊహించని ఏకకాలంలో జరిగిన ఈ దాడులతో ఒక్క రిజిస్ట్రేషన్ శాఖలోనే కాకుండా ఇతర శాఖల అధికారుల్లోనూ వణుకు మొదలైంది. ఒక్కసారి సోదాలతోనే ఆగిపోతే ఎలా?... అందుకే శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన తహశీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేయించిన పీఎస్ఆర్... ఏసీబీ తలచుకుంటే ఏం చేయగలదో చేసి చూపించారట. మొత్తంగా ఈ రెండు దాడులతో ఇప్పుడు ఏపీలో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పక తప్పదు