ఆగని వసూళ్ల దందా
హైద్రాబాద్, జనవరి 25,
మహానగర పాలక సంస్థకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు, అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కినా, అవినీతికి బ్రేక్ పడటం లేదు. అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టామని, శాటిలైట్ చిత్రాలు సిద్ధం చేస్తున్నామని ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. ఉన్నతాధికారుల ప్రకటనలు, చర్యలు ఎలా ఉన్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల నివారణకు సంబంధించి ఉన్నతాధికారులు అమలు చేస్తున్న విధానాలు నగరంలోని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అధికారులు, వారి కింది స్థాయి సిబ్బంది ఉదయం విధుల్లో చేరగానే, ఎక్కడెక్కడ కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారనే విషయంపైనే అనే్వషణ చేస్తున్నారు. ఎక్కడైనా రోడ్డుపై ఇసుక, ఇటుకలు వంటివి కనబడితే చాలు సదరు భవన యజమాని సిబ్బంది చేతిలో బుక్ అయినట్టే. ముందుగా పర్మిషన్ ఉందా? నుంచి మొదలయ్యే ఈ బేరం లక్షల్లోకి చేరుతోంది. నగరంలోని సెంట్రల్ జోన్‌లో కొందరు ఏసీపీలు సైతం క్షేత్ర స్థాయిలో తనిఖీలంటూ వెళ్లి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారు, అనుమతులున్నా, వాటిని ఉల్లంఘించి కట్టడాలు చేపట్టే వారిని గుర్తించి, వారి నుంచి లక్షల్లో మామూళ్లు గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బేగంబజార్ ప్రాంతంలో కేవలం 30 గజాల స్థలంలో ఆరు అంతస్తుల భవనం, మెహిదీపట్నంలో నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డులో నాలుగు అంతస్తుల భవనాలు కళ్ల ముందు అక్రమంగా నిర్మిస్తున్నా, అధికారులు వాటిని ప్రశ్నించే సాహసం చేయటం లేదు. ఆ భవనాలు కొందరు రాజకీయ నేతలకు చెందినవి కావటమే, అవి చేసుకున్న పుణ్యం. కాలనీలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే బస్తీల్లో 40 గజాల నుంచి వంద గజాల్లోపు చిన్న ఇళ్లు నిర్మించుకునే యజమానుల నుంచి సిబ్బంది బెదిరించి పనులు నిలిపివేస్తున్నారు. ఆ తర్వాత లక్షల రూపాయల్లో బేరాలు కుదుర్చుకుని మళ్లీ ప్రోత్సహిస్తున్నారు.ఎక్కడైనా అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయం ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు వస్తే, విచారించి నివేదికలు పంపాలని, ఫిర్యాదులను మళ్లీ అక్రమార్కులైన అధికారులకే పంపుతున్నారు. అదే అదునుగా ఫిర్యాదులతో సైతం దందాలు చేస్తున్నారంటే టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి ఏ మేరకు పెరుగుతుందో అంచనా వేయవచ్చు. సమర్థులైన కొందరు ఉన్నతాధికారులు గట్టిగా నిలదీసే సరికి తప్పించుకునేందుకు యజమానులకు ఏసీపీలు నోటీసులు జారీ చేసి తమ పనైపోయిదనుకుని చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత నోటీసులతో కోర్టులను ఎలా ఆశ్రయించాలి? స్టే ఎలా తెచ్చుకోవాలనే విషయంపై అక్రమ నిర్మాణదారులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. ఇదే కారణంతో జీహెచ్‌ఎంసీకి చెందిన కోర్టు కేసుల్లో ఎక్కువ టౌన్‌ప్లానింగ్‌కు చెందినవే ఉంటున్నాయి