ఘనంగా తై అమావాస్య ఉత్సవాలు
శ్రీకాళహస్తీ జనవరి 25
తై అమావాస్య ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్నవరదరాజస్వామి శ్రీ దేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. తెప్పోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తులను అలంకరణలో స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగ ముస్తాబుచేసి ఊరేగింపుగా తీసుకెళ్లి జయరామరావు వీధిలోని వైష్ణవ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. వివిధ రకాల సువాసనలు వెదజల్లే పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా, శోభయమానంగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామిని, ఉభయదేవేరులను అధిష్టింపజేసారు. అనంతరం తెప్పలపై అధిష్టించిన స్వామివారు హరినామస్మరణలతో , మంగళవాయిద్యాలతో వేదమంత్రోచ్ఛారణల నడుమ తెప్పలపై పుష్కరిణిలో 5పర్యాయములు విహరింపజేసి, తెప్పోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించారు.