శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి జనవరి 25,
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వై.ఎస్.ఆర్.కడప జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల నిర్వహించారు. అనంతరం శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది.
జనవరి 26న ధ్వజారోహణం :
జనవరి 26వ తేదీ ఆదివారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.