YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అభిమానం

అభిమానం

అభిమానం

అభిమానం అంటే ఒక్కోసారి ప్రేమ లేక ఇష్టం అని చెప్పచ్చు. మరోసారి అభిమానం అంటే తనపై తనకి గౌరవం అవుతుంది. సందర్భాన్ని బట్టి ఆ పదము అర్ధము మారుతుంది. మనం స్నేహితులను, బంధువులను అభిమానంగా ప్రేమగా చూస్తాము. "ఎవరన్నా ఏమైనా అంటే పడదురా, తనకి అభిమానం ఎక్కువ " అంటారు. ఇక్కడ అభిమానం అంటే తన మీద తనకి గౌరవం అని అర్ధం వస్తోంది. మీ వాళ్ళకి నువ్వంటే విపరీతమైన అభిమానం కదా అంటాము. నీ మాటల్లోనే తెలుస్తోంది ఆ మురిపెము అంటుంటారు. అభిమానధనులు అందరినీ అభిమానిస్తారు.

అభిమానం అనే పదానికి అర్ధాలు చాలా ఉన్నాయి. ఒక్కో సందర్భంలో అభిమానాన్ని చంపుకొని ఇతరులకోసం కొన్ని త్యాగాలు చేస్తారు. ఎంత గొడవలు చెలరేగినా కుటుంబంలోగానీ, ఎవరైనా సరే ఆ వ్యక్తిపై అభిమానంతో మౌనంగా ఆరాధిస్తూ అనురాగాన్ని చాటుకుంటారు కొంతమంది.

ఎంతో అభిమానంతో, ప్రేమతో బంధువుల ఇంటికి వెళితే వారు ఆ అభిమానానికి విలువలేకుండా మాట్లాడితే మన అభిమానాన్ని వారు    కించపరచినట్లే.

కొంతమందికి అహంకారంతో కూడిన అభిమానం ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా మనం గోపికలను చెప్పుకోవచ్చును. ఆ కధనం ఒకసారి...

శరదృతువు వచ్చింది. చంద్రుడు తన అమృత కిరణాలతో జీవులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. గోపాలకృష్ణుడు ఆ చల్లని వెన్నెలలో, యమునానది ఇసుక తిన్నెలపై విహరిస్తూ, మురళీ గానాన్ని ఇంపుగా ఆలాపించాడు. ఆ గానం చెవుల సోకగానే గోపకాంతలు ఎక్కడి పనులక్కడే వదలి దేవదేవుని దర్శనానికి బయలుదేరినారు. కొందరు ఇంటియందె నిలవబడి కృష్ణ విరహాగ్నిలో, సకల కర్మవాసనలను తపింపజేసి, భవబంధాలను తొలగించుకున్నారు.

ఆతృతగా వచ్చిన గోపికలను చూసి భగవంతుడు "ఆ గచ్చంతు మహాభాగా" అంటూ స్వాగత వచనాలు పలికినాడు. పరమ భాగవతులారా! రండి రండి అంటూ ఆహ్వానించాడు. గోపికలు సర్వ కోర్కెలను వదలి అభిమానాన్ని పూర్తిగా వదిలేసి, నిరభిమాని వద్దకు పరుగు పరుగున వచ్చారు. అటువంటి భక్తులైన గోపికలకు భగవంతుడు పలికిన స్వాగతము, గోపికల భక్తి తత్వానికి నిదర్శనము. ఏనాటికైనా తమంతట తామే వదిలిపెట్టిపోయే సంసారిక భోగాలను బుద్ధిపూర్వకంగా వదలి, నిత్యుడు సత్యుడైన పరబ్రహ్మ సన్నిధిని కోరి వచ్చినవారు భాగ్యవంతులు. శ్రీకృష్ణుడు గోపికల మనసెరిగి వారితో రాసలీల సాగించాడు. అప్పుడు కొందరు గోపికల యందు తామే ఉన్నతులమనే భావన కలిగింది. అది గమనించిన భగవంతుడు అంతర్ధానమయ్యాడు. అహంకారం అభిమానం ఉండేచోట నిరభిమానియైన భగవంతుడుండడు. గోవిందుని అదృశ్యముతో వారి అహంకారం తొలగిపోయింది. వారు చెట్టును, పుట్టను అడుగుతూ ఆయన కొరకు పరితపించసాగారు. వారి ఆవేదనను గ్రహించిన పరమాత్మ వారిని కరుణించి వారి చెంతకు చేరి వారికి ఆనందాన్ని కలిగించాడు. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ నేనే చేస్తున్నాను అనే అహంకార పూరిత అభిమానం పెట్టుకొన్నా అక్కడ క్షణమైనా ఆలస్యం కాకుండా దాని పరిణామం కనిపిస్తుంది. కార్యసిద్ధి జరుగదు. ధర్మరక్షణార్ధమై అవతరించిన భగవంతుడు తన అవతార కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించి, తన వైకుంఠ దామమును చేరుకున్నాడు.

అన్ని దు:ఖాలకు ఆశ, అభిమానం, అహంకారం కారణమవుతాయి. మనకు ప్రియమైన వస్తువులను వ్యయప్రయాసల కోర్చి సమకూర్చుకుంటాము. వాటిపై మమకారాన్ని పెంచుకుంటాము. మమకారం  దు:ఖహేతువని గ్రహించి,దానిని వదిలితే కాని సుఖం లభించదని తెలుసుకోలేకపోతున్నాము. పసిబాలుడు ఏ విధమైన అలజడులు లేక ఆనందంగా ఉంటాడు. యోగి కూడా ఇంద్రియాలను జయించి ఏ అలజడులు లేక శాంతంగా ఉంటాడు. అట్లే సాధకులైన మనం మమకార, అభిమాన, అహంకార రహితులమై బేధభావములను వదలి  ఆనందముగా  ఉండవలెను.

అన్ని ఉపాధులకు భగవంతుడు ఉపాధిగా ఉన్నాడు. భగవంతుడు స్వత:నిరాకారుడై అవ్యక్తంగా సృష్టినంతా వ్యాపించియున్నాడు. అవతార వైశిష్ఠ్యాన్ని బట్టి ఆ అవతార పురుషునిగా భగవంతుని ఆయా పేర్లతో కొలుచుకుంటాము. కాని భగవంతుని రూపం కంటికి గోచరించేది కాదు. అఖండానందాత్మకమైన అనుభవము కలిగినవారు కూడా భగవంతుని రూపం ఇది అని చెప్పలేరు కదా! ఆత్మ సాక్షాత్కారమును అనుభవించి మౌన యోగితత్వములో విరాజిల్లుతారు.. ఆ ఆత్మానందములో భగవంతునితో లయిస్తారు..అది మనకు కంటికి గోచరించేది కాదు. ఇంద్రియాతీత విషయాలు అగోచరం. సాధకులైన మనం  శాశ్వతానంద స్వరూపుడైన భగవంతుని పాదపద్మాలను హృదయమందు నిలుపుకొని సద్విచారముతో శాంతిని పొందవలయును.
 

Related Posts