శుద్ధమౌనం
మౌనమే ఉత్తమోత్తమమైన ఉపదేశం. పరిణతి పొందిన వారికి మాత్రమే ఇది సంతృప్తినిస్తుంది. సాధారణులకు మాటల ద్వారా బోధిస్తేనే సంతోషపడతారు. సత్యం మాటలకు అందేది కాదు. ఉపన్యాసాలు కొద్ది మందికి మాత్రమే తాత్కాలికమైన మార్పును ఇస్తాయి. మౌనము సర్వులకు శాశ్వతమైన పరివర్తనాన్ని అనుగ్రహిస్తుంది. మౌనమే ఆత్మకు మారు పేరు. మౌనము నాలుగు విధములు. వాజ్మౌనము, నేత్ర మౌనము, కర్ణ మౌనము, మానసిక మౌనము ఇదియే శుద్ధమౌనం. ఇదే ప్రధానమైనది. దక్షిణామూర్తి మౌనం ద్వారానే సత్యాన్ని ప్రబోధించారు.
మౌనమే అనంత భాషణం.. అదే ఒక్కమాట.. అదే నిక్కమైన యిష్ఠాగోష్ఠి.. మౌనము నిరాటంకమైన విద్యుత్ ప్రవాహము వంటిది. కొన్ని వందల ఉపన్యాసాలు, గ్రంధాలు చేయలేని పనిని, జ్ఞాని కొన్ని క్షణాలలో మౌనం ద్వారా సాధకునిలో వివేకాన్ని నింపగలడు.
మౌనమంటే మాట్లాడకుండా ఉండటం కాదు.ఎక్కడ నుండి ఆలోచన, మాట పుడుతున్నదో, అదే మౌనం. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌనభాషణను నిరోధిస్తుంది. మౌనం సమస్త మానవాళిని అభివృద్ధి పరుస్తుంది. సదా ఆత్మచింతనమే మౌనం.
మానవుడు తన నాలుక అగ్రభాగాన్ని కదిలిస్తూ మాట్లాడే శక్తిని కలిగి ఉంటాడు. మాట్లాడటమనే పని వాణితో ఆరంభమై ,చెవితో ముగుస్తుంది. ..వాక్కు - అర్ధం - వాణి... వాక్ అంటే పార్వతి, అర్ధమంటే పరమేశ్వరుడు. మనస్సు ఆలోచించేదే వాణి ద్వారా వ్యక్తమవుతుంది. సృష్టి ద్వారా కూడా పరమేశ్వరుని జ్ఞానం వ్యక్తమవుతుంది.
పరమాత్ముడు సృష్ట్యాదిలో మానవుని సృష్టించి నప్పుడు వారు అంతకు పూర్వం బాగా వికసించిన బుద్ధిజీవులు. గత జన్మ సంస్కారాల వలన వారికి లోపలనుండి ప్రేరణ వచ్చింది. వారు ప్రతి భావానికి పదార్ధానికి ఒక పేరు పెట్టి దానిని వాణి ద్వారా వ్యక్తం చేయసాగారు. వాణికి ఏదైనా మాట్లాడమని లోపలనుండి నైసర్గిక ప్రేరణ కలుగుతుంది. మనమేమీ మాట్లాడకపోతే లోపలే వాణి సూక్ష్మంగా అవ్యక్తరూపంలో మాట్లాడుకుంటుంది. ఈ ప్రేరిత వాక్కే మనుష్యజనిత ప్రధమ వాక్కు. అది భాష. ఈ భాష విద్వాంసులైన ఋషుల విజ్ఞానం వారి శుద్ధమైన మనస్సులలో నిగూఢంగా దాగిఉంది. ఇది వారు అనేక జన్మలలో పుణ్యఫలంతో సాధించిన జ్ఞానం. ప్రేమపూర్వకంగా దానిని ఇతరులకు తెలుపమని వారికి లోపలనుండి ప్రేరణ కలుగుతుంది. ఇదే ఆ భాషకు-భావనకు శుద్ధ స్వరూపమవుతుంది.
బృహస్పతి అనే శబ్దానికి పరమాత్ముడు అనే అర్ధం ప్రధమంగా గ్రహించాలి. అలాగే వాచస్పతి అంటే వాక్కుకు పతి పరమాత్ముడు. వాక్కు పరమేశ్వర ప్రసాదితం. ఆ వాక్కు-వాణి సరస్వతి నిలయం కావాలి. వాగ్ధేవియై వర్ధిల్లాలి అనేది ఋషుల శుభసందేశం. వాచస్పతి వాణి (వేదం) జ్ఞానానికి ఆశ్రయమై ఉండాలని వాణిలో నుండి వెలువడే ప్రతి పదం మధురమై మహత్తరమై మనోరంజకమై విరాజిల్లాలని మానవులకు పరమాత్ముని ఉపదేశం.