రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ మృతులు
బీజింగ్, జనవరి 27
చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ భయంకర వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మరణించారు. ఇప్పటివరకు చైనాలో మొత్తం 2,300 మంది ఈ వైరస్ బారినపడినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతి రోజు దాదాపు 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. జలుబు, దగ్గుతో మొదలవుతున్న ఈ వ్యాధి ముదురుతూ.. నిమోనియాగా మారి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తోంది. చైనాతో పాటు జపాన్, తైవాన్, నేపాల్, హాంగ్‌కాంగ్, వియత్నాం, మలేషియా, సింగపూర్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు కూడా కరోనా వైరస్ వ్యాపించింది. కాగా, చైనా ఈ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైరస్‌ను కట్టడి చేయడానికి చైనా వైద్యులు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నారు. భారత్‌లో ఈ వైరస్ ప్రవేశించనప్పటికీ.. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేక థెర్మల్ స్క్రీనింగ్ టెస్టులు జరుపుతున్నారు.