నిఘా మధ్యలో సమ్మక్క సారలమ్మ జాతర
మేడారం, జనవరి 27,
సమ్మక్క-సారలమ్మ జాతర అంటే పూజారులు నిర్ణయించిన తేదీల్లో భక్తుల సందడి కనిపించేది. దీనికి తోడు తల్లులు గద్దెలపైకి చేరుకున్న తర్వాతనే మొక్కులు ఇచ్చే సంస్కృతి కొనసాగేది. క్రమక్రమంగా తల్లులపై పెరిగిన భక్తి అపార నమ్మకంతో నిత్య జాతరగా మారుతున్నది. మొక్కులు చెల్లించే కార్యక్రమం నిత్యం కొనసాగుతున్నది. ఇంటర్నెట్, వాట్సప్‌లు, వివిధ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లతో వైఫై, మొబైల్ ఫోన్ల మోతలు, సీసీ కెమెరాలతో నిఘా, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ జాతర సమయంలోనే ఇక్కడ కనిపిస్తుంటుంది. వీటికి తోడు భక్తులకు అవసరమైన వసతి, సౌకర్యాలను కల్పించేవారు. కానీ, నిత్యం పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎక్కువగా నిధు లు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాయి. గుడిసెలు, పెంకుటిళ్లు మాత్రమే కన్పించే మేడారంలో శాశ్వత నిర్మాణాలు మొదలయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు దర్శనమిస్తున్నాయి. 2006లో ఐటీడీఏ ద్వారా పది కాటేజీలను రూ.20లక్షలతో నిర్మించారు. రూ. 50లక్షలతో అదే సంవత్సరం టీటీడీ భవనం కూడా నిర్మించారు. ఇక మొదటి ఇంగ్లిషు మీడియం పాఠశాలను కూడా గిరిజన సంక్షేమశాఖ ఇక్కడే ప్రారంభించింది. గత జాతర ముందు రూ.60లక్షలతో 27 షాపింగ్ కాంప్లెక్లును నిర్మించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో అతిథి గృహాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్, ఎస్పీ, మంత్రులు బసచేసే విధంగా అతిథిగృహం నిర్మించారు. సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు మందిరాన్ని కూడా ఇందులో ఉంది. అయితే, సమ్మక్క-సారలమ్మ సన్నిధిలోకి వచ్చే భక్తులు సంఖ్య ఎక్కువైంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కులు చెల్లించిన తర్వాత అడవిలోనే బస చేసి వంటలు చేసుకోవడం, మూడు రాత్రులు నిద్రించడం కొనసాగేది. ప్రస్తుత హైటెక్ యుగంలో భక్తులకు అనుగుణంగా మరిన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.పట్టణాలకే పరిమితమయ్యే సౌకర్యాలు, ఏర్పాట్లు మేడారంలో కల్పిస్తున్నారు. మేడారం జాతర తర్వాత కూడా భక్తులకు ఉపయోగపడే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోట్లాది రూపాయలతో పనులు చేస్తున్నారు. మేడారంలో ప్రత్యేకంగా రూ.2కోట్లతో ఆదివాసీల మ్యూజియం నిర్మాణం చేపట్టారు. ఆదివాసీల మ్యూజియంలో సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆదివాసీలు వినియోగించే అనేక రకాల వస్తువులు, పరికరాలను ఇందులో ఏర్పాటు చేశారు. హరితహోటల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ జాతర నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. మ్యూజియంలు కేవలం పట్టణాల్లో ఉండడం సహజం. కానీ, మేడారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని గుర్తించిన ప్రభుత్వం జాతర ప్రాంగణంలో మ్యూజియం ఏర్పాటు చేసింది. రూ. 3.50కోట్లతో ఇక్కడ హరిత హోటల్ నిర్మిస్తున్నారు. పది కాటేజీలు నిర్మించేందుకు నిధులు మంజూరు కాగా, పనులు పూర్తికావొచ్చాయి. ఓపెన్ రెస్టారెంట్, 24మందికి ఉపయోగపడే విధంగా ఏసీ రెస్టారెంట్‌ను నిర్మిస్తున్నారు. ఇక హంపీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 300 మంది కూర్చుని వీక్షించే విధంగా నిర్మాణం జరుగుతున్నది. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ చిత్ర ప్రదర్శనలకు ఉపయోగపడనుంది. దీనికి తోడు పక్కనే భక్తులు విడిది చేసేందుకు 46 లగ్జరీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫారాల నిర్మాణ పనులు కూడా పూర్తి కావచ్చాయి. టీటీడీ భవనంపై మరో అంతస్తును కూడా రూ.60లక్షల వ్యయంతో గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో నిర్మాణం చేపడుతున్నారు. పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు సిబ్బంది, అధికారులకు పక్కా భవనం అవసరంగా భావించిన ప్రభుత్వం రూ.60లక్షలతో భవనం పనులు కొనసాగుతున్నాయి. ఊరట్టం పంచాయతీ పరిధిలో మేడారం ఉన్నప్పటికీ ఇక నుంచి మేడారంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహణ కొనసాగేలా రూ.16లక్షలతో పక్కా భవనం నిర్మించారు. కొత్తూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ ఉండగా మేడారంలో రూ.1.20 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే మేడారం జాతర పరిసరాలకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో జాతర సమయంలో ఉండే లో-వోల్టేజీ సమస్య కూడా తీరనుంది