బీహార్ బియ్యం కొనుగోళ్ల పైనే మిల్లర్ల ఆసక్తి
నల్గొండ, జనవరి 27,
బీహార్ నుండి సుమారు 60,000 క్వింటాళ్ల హెచ్‌ఎంటి ధాన్యం మిర్యాలగూడ పట్టణంలోని రైస్‌మిల్లులకు చేరుకుంది. బీహార్ నుండి వ్యాగన్లలో వచ్చిన సుమారు 60వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు లారీల్లో లోడ్ చేసి తమ మిల్లులకు తరలించుకుపోయారు. హెచ్‌ఎంటి రకం ధాన్యాన్ని మిర్యాలగూడ మిల్లర్లు బీహార్‌లో క్వింటాలుకు 2,000 రూపాయలు ధర పెట్టి కొనుగోలు చేశారని తెలిసింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రైస్‌మిల్లర్లు ఆసక్తి కనబర్చకపోవడం, బీహార్ నుండి దిగుమతి చేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. . హెచ్‌ఎంటి ధాన్యంలో సుమారు 17 శాతం తేమ ఉండటం వల్ల ఆ ధరకు తాము కొనుగోలు చేశామని మిల్లర్లు అంటున్నారు. అదే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతంలో పండించిన హెచ్‌ఎంటి ధాన్యంలో తేమ 25 శాతం వరకు ఉంటుందని ఎక్కువ ధర పెట్టలేమని అందుకు గాను చౌకగా, నాణ్యత, బాగా ఎండిన ధాన్యం బీహార్‌లో దొరకడం వల్ల కొనుగోలు చేస్తున్నామని మిల్లర్లు అంటున్నారు. దీంతో ఆయకట్టు ప్రాంతంలోని మిర్యాలగూడ, త్రిపురారం, వేములపల్లి, దామరచర్ల తదితర మండలాల రైతులు తాము పండించిన ధాన్యం అటు ప్రభుత్వం కొనుగోలు చేయక, ఇటు మిల్లర్లు కొనక ఇబ్బందులు పడ్తున్నామని పేర్కొన్నారు. రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు పడ్తున్నామని రైతులు వాపోతున్నారు. స్థానికంగా ధాన్యం ఉండగా ఇతర రాష్ట్రాల నుండి దిగుమతికై అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అన్యాయమని రైతులు వాపోతున్నారు.