ఇరాన్ పై రాకెట్ దాడులు
బాగ్దాద్, జనవరి 27
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై రాత్రి రాకెట్ దాడులు జరిగాయి. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సమయంలో మరోసారి రాకెట్ దాడి జరగడం కలకలం రేగుతోంది. బాగ్దాద్‌లోని రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఎవరికీ ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని అటు ఇరాక్ భద్రతా బలగాలు, ఇటు అమెరికా వర్గాలు ప్రకటించాయి. మొత్తం మూడు రాకెట్లతో దాడిచేయగా రాయబార కార్యాలయం ప్రహరీ గోడ, క్యాంటీన్ ధ్వంసమయ్యాయి.రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మరోసారి దాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నేరుగా అమెరికా రాయబార కార్యాలయంపైనే క్షిపణి దాడి జరగడంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అమెరికా రాయబార కార్యాలయంపై దాడిని ఇరాక్ ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ, స్పీకర్ మొహమ్మద్ హల్‌బుసి తీవ్రంగా ఖండించారు. తమ భూభాగాన్ని రణక్షేత్రంగా మారుస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇప్పటి వరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. కానీ, ఇరాన్ మద్దతు తీవ్రవాద సంస్థలే ఈ దాడికి పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఇరాక్‌లో భారీ స్థాయిలో పౌరులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ తరుణంలో దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.తాజా రాకెట్ దాడిపై అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రాకెట్ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారని, సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారని అన్నారు. తమ దౌత్య కార్యాలయ ఉద్యోగులకు భద్రతను మరింత పటిష్టం చేయాలని ఇరాక్ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఈ దాడి ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉగ్రవాదుల పనేనని, గత సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఇరాక్‌లోని తమ పౌరులపై 14 దాడులు జరిగాయని తెలియజేశారు. బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడులను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మైఖేల్ మెక్‌కౌ వ్యాఖ్యానించారు.