ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను అమ్మేందుకు
న్యూఢిల్లీ, జనవరి 27
ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఇవాళ కేంద్రం ప్రకటించింది. జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఇండియా.. దివాళా వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థలో మెజారిటీ వాటాను అమ్మాలని ప్రభుత్వం భావించింది. కానీ 2018లో బిడ్‌లకు ఆహ్వానం పలికినా.. ఆ సంస్థలో వాటాను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. దేశీయ, విదేశీ విమానాలను ఎయిర్ ఇండియా నడుపుతున్న విషయం తెలిసిందే. వాటాను కొనుగోలు చేసుకోవాలనుకునేవారికి మార్చి 17వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించారు. 2018లో ఎయిర్ ఇండియా సుమారు 76 శాతం వాటాను అమ్మాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం 50 వేల కోట్ల అప్పులో ఉన్నది. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ స్టేక్స్ అమ్మాలని నిర్ణయించారు.