నూతన మేయర్ కు స్వాగతం పలుకుతున్న పాత సమస్యలు
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలోని ప్రధాన రహదారులు.. గల్లీలల్లో ఉన్న రోడ్లు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయి. అడుగడుగునా గుంతలు ఉండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోడ్లపై గుంతలు అధికంగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎన్నికల ముందు నగరాన్ని సింగపూర్‌గా మారుస్తామంటూ నాయకులు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని సీతారాం నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ, న్యాల్కల్ రోడ్, గాయత్రీ నగర్, వివేకానంద నగర్, అశోక్ నగర్ లలోని ప్రధాన రోడ్లన్నీ పూర్తి అద్వాన్నంగా ఉన్నాయి. వర్ష కాలంలో అయితే రోడ్లపైకి వాహనాలతో రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న రోడ్లను, ప్రజల ఇబ్బందులను పట్టించుకోనే నాధుడే లేడని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం ఈ రోడ్లపైకి భారీ వాహనాలు రాకుండా అధికారులు చర్యలు తీసుకొవాలని స్దానికులు కోరుతున్నారు.
నిజామాబాదు నగరంలో మరోవైపు ప్రజలు మురికితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీతారం నగర్ కాలనీ, గాయత్రీ నగర్ కాలనీలు మురికి కుపంగా మారాయి. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్లన్ని చెత్తతో నిండిపోయి... రాకపోకలకు అంతరాయం కలుగుతుందని కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నగరంలో చాలాచోట్ల స్ట్రీట్ లైట్లు లేక రాత్రి సమయంలో సతమతవుతున్నామన్నారు. దీనిని అదునుగా భావించి నగరంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలోని చాలా చోట్ల రోడ్లపై గుంతలు అధికంగా ఉండటం వల్ల ప్రయాణం కష్టంగా ఉందని వాహనాదారులు చెబుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన గుంతలను సరిగా పుడ్చక పోవడం వల్ల రోడ్లు మరింత అద్వాన్నంగా మారుతున్నాయన్నారు. నగరం లోని పలు కాలనీల్లోకి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని వెళ్లాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా అధికారంలోకి వచ్చిన అధికారులు నగరంలోని సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.