తెలంగాణలో పెరిగిన పంట దిగుబడి
వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో అన్ని పంటల దిగుబడి అనూహ్యంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించిన కారణంగా దిగుబడులు బాగా పెరిగాయని, వనపర్తి జిల్లాలో వేరుశెనగ, వరి, కందులు వంటి పంటలు బాగా పండాయని తెలిపారు. వనపర్తి జిల్లా వేరుశెనగ కు దేశంలోనే అగ్రస్థానం పొందిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు 5800 /- రూపాయల మద్దతు ధర చెల్లించి కందులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్రంలో 46 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు పరిమితి విధించింది అని, అయితే రాష్ట్రంలో కంది పంట దిగుబడి ఎక్కువగా ఉన్నందున 46 వేల మెట్రిక్ టన్నుల పరిమితి విధించడం వల్ల రాష్ట్ర రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, మరో 50వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. అప్పటివరకు జాప్యం లేకుండా మార్క్ఫెడ్ ద్వారా కందుల కొనుగోలును ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆయా మార్కెట్ యార్డులలో లేదా ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాలకు కేవలం మన రాష్ట్రంలోని రైతులు పండించిన కందులు మాత్రమే తీసుకోవాలని, ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే కందుల పై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో మన రైతులు కూడా ఇతర ప్రాంతాల రైతులకు సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ స్వర్ణ సింగ్, డి సి ఓ కోదండరాములు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.