జనవరి 30 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖలో శ్రీనివాస చతుర్వేద హవనం - తిరుపతి
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 30 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖపట్నంలోని పెందుర్తిలో గల శ్రీశారదా పీఠంలో శ్రీనివాస చతుర్వేద హవనం జరుగనుంది. శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారు, ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో లోక కల్యాణం కోసం 5 రోజుల పాటు ఈ చతుర్వేద హవనం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 100 మందికిపైగా వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొంటారు.5 రోజుల పాటు ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు వేద హవనం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో చతుర్వేద హవనం ముగుస్తుంది. ఈ హవనంలో పాల్గొనే భక్తులకు సుఖశాంతులు, ధనధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయని పండితులు తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
చతుర్వేద హవనం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు సుప్రసిద్ధ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 30న పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శోభానాయుడు శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం ప్రదర్శిస్తారు. జనవరి 31న అన్నమయ్య సంకీర్తన సౌరభం పేరిట సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ప్రసిద్ధ గాయకులు శ్రీమతి సునీత, చందన బాలకల్యాణి, నేమాని పార్థసారథి, శరత్ సంతోష్, సత్యయామిని, శ్రీ జోశ్యుభట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు. ఫిబ్రవరి 1న తమిళనాడులోని కుంభకోణానికి చెందిన శ్రీ విఠల్‌దాస్ మహారాజ్ భజనామృతం, ఫిబ్రవరి 2న డా. పద్మజారెడ్డి బృందంతో శక్తి పేరిట నృత్యరూపకం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.