పోలీసులమంటూ దోచేశారు
హైద్రాబాద్,
హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులమని నమ్మించి గోల్డ్ వ్యాపారిని నిలువుదోపిడీ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమంథ్ హైదరాబాద్‌లో నివాసముంటూ బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటాడు. మంగళవారం రాత్రి సమంథ్ ఇంటికొచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని, ఓ కేసు విషయమై విచారించాలంటూ అతడిని బైక్‌పై తీసుకెళ్లారు.మాదన్నపేటలోని ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం వద్ద బైక్ ఆపిన వారిద్దరు సమంథ్‌ను బెదిరించి అతడి డెబిట్ కార్డులు లాక్కున్నారు. వాటిలో రూ.10వేల నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం అతడిని కొట్టి సెల్‌ఫోన్ లాక్కుని బైక్‌పై పరారయ్యారు. దీంతో అవాక్కైన బాధితులు వారు నకిలీ పోలీసులను గుర్తించాడు. వెంటనే మాదన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీంతో మాదన్నపేట పోలీసులతో పాటు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందితులను పాతబస్తీకి చెందిన పాత నేరస్తులు వసీం, గౌస్‌గా గుర్తించారు. వారి కదలికలను పసిగట్టి కేవలం రెండు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాలు తయారుచేసే సమంథ్‌ను దోచుకోవాలని వీరు కొంతకాలం క్రితమే ప్లాన్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.