YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

అంగరంగ జాతరకు అంత సిద్ధం

అంగరంగ జాతరకు అంత సిద్ధం

అంగరంగ జాతరకు అంత సిద్ధం
వరంగల్, జనవరి 30,
సమ్మక్కా, సారక్కలు.. అనేక శతాబ్ధాలుగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్న వనదేవతలు చరిత్ర పరంగా చూసినా, జానపద కథల్లో చూసినా ధీర వనితలుగానే కనిపిస్తారు. అందుకే ఒకప్పుడు గిరిజనలకు మాత్రమే ఆరాధ్యులైన సమ్మకా, సారక్కలు ఇపుడు అశేష జనవాహిని గుండెల్లో కొలువైనారు. రెండేళ్ల కోసారి జరిగే జాతరకు వచ్చే కోట్లాది భక్తులకు కొంగు బంగారంగా మారారు.. మేడారం జాతరలో కనిపించే ప్రత్యేకతలు మరే జాతరలో కనపించవు. ఇక్కడ వేద మంత్రోచ్చరణలు వినిపించవు.. మతాచారాలు కనిపించవు.. విగ్రహారాదన అసలేఉండదు.. అయినా ఇక్కడికి తరలి వచ్చే కోట్లాది జనం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. తమ ఇష్ట దైవాలను మనసారా కొలుస్తారు.. అందుకే ఈ జాతర ఒక్క మేడారానికే పరిమిత కాలేదు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో మేడారాన్ని పోలిన అనేక జాతరలు గొప్పగా జరుగుతున్నాయి. ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే దేవాదాయ శాఖ గుర్తించిన 32 చోట్ల ఈ జాతరలు నిర్వహిస్తున్నారు. గుర్తించనివి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో కనిపిస్తారు. అచ్చం మేడారంలాగే గిరిజన సంప్రదాయాలను అనుసరించి జరుగుతాయి. తెలంగాణ కుంభమేళా మేడారం సమక్క, సారక్క జాతర. 900ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుక, ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. జాతరను ఒకప్పుడు స్థానిక గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. కానీ, 1940 తర్వాతి నుంచి రాష్ట్ర ప్రజలంతా జరుపుకుంటున్నారు. ఈ ధీరవనితల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మౌఖికంగానే ఎక్కువగా కనిపిస్తాయి. కప్పం కారణంగా కాకతీయులకు, గిరిజనులకు జరిగిన యుద్ధం చుట్టే ప్రతి కథా తిరుగుతుంది. కోయదొరలు చెప్పుకునే కథల్లో, పాడుకునే పాటల్లో ఈ వనదేవతల ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది తప్ప, ఎక్కడా లిఖిత పూర్వక గంథ్రాలుగానీ, శాసనాలుగాని కనిపించవు. ఒక జానపద కథలో సమ్మక్క మన ప్రాంతంలోనే పుట్టిపెరిగినట్లు తెలుస్తుంది. నేటి జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలోని పొలాసను మేడరాజు అనే గిరిజన దొర పాలించాచేవాడట. సంతానం లేని ఇతనికి అడవిలో పుట్టపైన దొరికిన బిడ్డనే సమ్మక్కట. ఆమెను అల్లారు ముద్దుగా పెంచి, తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడట. పగిడిద్ద రాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అను ముగ్గురు సంతానం కలిగారట. రాజ్య విస్తరణ కోసం కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలాసపై దండెత్తాడట. ఆ దాడిని తట్టుకోలేని మేడరాజు తన కూతురు ఇంటికి వెళ్లి తల దాచుకున్నాడట. ఇటు కాకతీయులకు సామంతుడిగా ఉన్న తన అల్లుడు పగిడిద్ద రాజు కరువు కాటకాల కారణంగా ఒక ఏడాది కప్పం చెల్లించ లేదట. కప్పం కట్టక పోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కాకతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోస్తూ రాజ్యాధికారాన్ని దిక్కరిస్తున్నాడనే కారణాలు చూపి పగిడిద్ద రాజుపై కూడా ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడట. తన ప్రధాన మంత్రి యుగంధరుడితో కలిసి దండెత్తిన ప్రతాపరుద్రున్ని. సంప్రదాయ ఆయుధాలతో ఎదిరించిన పగిడిద్ద రాజు, సమ్మక్క, సారాలమ్మ, నాగమ్మ, జంపన్న గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధానికి దిగారట. ఇందులో కొందరు మరణించారట. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. యుద్ధభూమిలో విరోచిత పోరాటం చేసిన సమ్మక్క, చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిని చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైందట. వెతుక్కుంటూ వెళ్లిన వారికి ఆమె కనిపించ లేదు. కానీ, ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలతో ఉన్న ఒక భరిణె కనిపించిందట. దానినే సమ్మక్కగా భావించి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సమ్మక్కపై మరో కథ కూడా ప్రచారంలో ఉన్నది. 13వ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న మేడారం ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు. ఓసారి కోయదొరలు వేటకు వెళ్లినపుడు ఓ పసిబిడ్డ ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిందట. ఆ సమయంలో చుట్టూ పులులు, సింహాలు, ఆమెకు రక్షణగా ఉన్నాయట. ఈ దృశ్యాన్ని చూసిన కోయలు ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించి, తమ గూడెం తెచ్చుకుని సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారట. కరువులో తమకు తోడుగా నిలిచే దేవతగా ఆమెను కొలుచుకున్నాట. సమ్మక్క చేతితో ఇచ్చే ఆకు పసరు ఏ రోగాన్నైనా ఇట్టే నయం చేసేదట. సమ్మక్కకు యుక్త వయసు రాగానే మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుతో పెండ్లి చేశారట. వీరికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే సంతానం కలిగారట. ఇలా సాగే జానపద కథ మళ్లీ చరిత్రలోకి వస్తుంది. కాకతీయ రాజులు కప్పం కట్టకుంటే దండ యాత్ర చేయడం, సమ్మక్క, సారాలమ్మ వారిని ఎదిరించి ధీర వనితలుగా నేల రాలడం, సమ్మక్క కుంకుమ భరిణెగా కనిపించడం లాంటి విషయాలతో కూడిన ఈ కథలు ప్రచారంలో ఉన్నవి. చరిత్ర పరంగా, జానపద కథల పరంగా చూసినా సమ్మక్క మహిమాన్విత శక్తి రూపినిగా కనిపిస్తుంది. ఆ విశ్వాసమే వనదేవతలను గిరిజనులు మొదలుకుని అశేష జనవాహిని కొలిచే ఇంటింటి ఇలవేల్పులుగా నిలిపింది. అందుకే మేడారం జాతర హరిద్వార్ కుంభమేళా తర్వాత అంతటి పెద్ద ఉత్సవంగా ఖ్యాతి గడించింది. తెలంగాణ అంతటా విస్తరించింది. ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క, సారక్క జాతర మేడారంతోపాటు అన్ని జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంతటా ఉత్సవాలు నాలుగు రోజులపాటు ఒకే తీరున సాగుతాయి. గట్టమ తల్లి పూజలు, ఎదురు కోళ్ల సమర్పణ, ఒడి బియ్యం, శివసత్తుల పూనకాలు, బెల్లం తూకాలు, కోయ, గోండు గిరిజన నృత్యాలు, అబ్బియ రాగాలు.. ఇలా అంతటా ఒకే తీరున కనిపిస్తాయి. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను నిర్వహిస్తారు. కోయపూజారులు తమ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుతారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపాన ఉన్న సమ్మక్కను గద్దెకు తీసుకవస్తారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ తోలుకవచ్చి ప్రతిష్ఠిస్తారు. మొదటి రోజు నుంచే తరలివచ్చే భక్తులు, మూడో రోజు పెద్దసంఖ్యలో వచ్చి తల్లీబిడ్డలకు మొక్కులు అప్పజెప్పుతారు. నాలుగో రోజు వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.

Related Posts