కరోనా వైరస్ పట్ల అప్రమత్తం
కర్నూలు, జనవరి 30
ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ వైద్యులను సూచించారు. గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేయింగ్ బ్లాక్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డ్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వైరస్ సోకితే రోగులకు సత్వరమే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వెంటిలేటర్, ఆక్సిజన్, అత్యవసర వైద్య పరికరాలు, మందులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా వుంచినట్లు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ జి.ఎస్. రాంప్రసాద్ కలెక్టర్ కు నివేదించారు. ఈనెల 24వ తేదీన కరోనా రాపిడ్ రెస్పాన్స్ టీమును ఏర్పాటు చేశామని, ఈ బృందానికి నోడల్ అధికారిగా మెడిసిన్ హెచ్ఓడి, డిప్యూటీ సూపర్నెంట్ డాక్టర్ నర్సింహులు, పల్మనాలజి హెచ్ఓడి డాక్టర్ శైలజ, మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ సురేఖలు సభ్యులుగా ఉన్నారని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం వస్తే రోగులకు వెంటనే వైద్య చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి సిద్దంగా ఉంచాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదు కాలేదన్నారు. కేసులు నమోదు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర కేసులకు అవసరమైన అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.