విశాఖ పట్నం భూ అక్రమాలపై సిట్ నివేదిక సిద్ధం
అమరావతి జనవరి 30
విశాఖ పట్నంలో జరిగిన భూ అక్రమాలపై సిట్ తన మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందచేసింది. ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉన్నందున మధ్యంతర నివేదికను మాత్రమే రూపొందించి ముఖ్యమంత్రికి అందచేశారు. ఈ నెల 31తో సిట్ గడువు ముగియనుండడంతో పొడిగించాల్సిన అవసరముందని వారు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమాలపై లోతుగా అధ్యయనం చేయాలని సిట్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా సిట్ గడువు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. సిట్ ఛైర్మన్ డా.విజయ్‌కుమార్, సభ్యులు అనురాధ, భాస్కర్‌రావు సీఎంను అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 1351 ఫిర్యాదులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. భూ అక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినట్లు గుర్తించినట్లు, ఆ అంశాలను నివేదకలో పొందుపర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాల్లో ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఉన్నట్లు వారు తెలిపారు. ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు ఉన్నాయని వారు సీఎంకు వివరించారు.