తమిళనాడులో దారుణం
చెన్నై, జనవరి 30
తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వేలూరులోని అమ్రితి పార్కు సమీపంలో గల అటవీ ప్రాంతంలో కాలేజీ చదువుతున్న యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. నిందితులను ఓ వృద్ధుడు ధైర్యంగా అడ్డుకోవడంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. వేలూరులోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తోంది. వీరిద్దరు అప్పుడప్పుడు బయట షికార్లు కొట్టేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఆ విద్యార్థి యువతిని అమ్రితి పార్కుకు తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత వారిద్దరు సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ యువకుడి ముగ్గురు మిత్రులు మాటు వేశారు. నలుగురు కలిసి ఆమెను బంధించి అత్యాచారానికి యత్నించారు. యువతి కేకలు విన్న ఓ వృద్ధుడు అక్కడికి పరుగు పరుగున వచ్చి వారిని అడ్డుకున్నారు. దీంతో నిందితులు అతడిపై దాడికి పాల్పడ్డారు. వృద్ధుడు గట్టిగా ఈల వేయడంతో సమీపంలో చెట్లు నరికే కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పరారయ్యారు. వారంతా కలిసి ఓ నిందితుడిని పట్టుకుని నెత్తిమీద కట్టెల మోపు పెట్టి సమీప గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ స్థానికులందరూ కలిసి అతడికి దేహశుద్ధి చేశారు.ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత స్థానికులు నిందితుడిని విడిచిపెట్టడంతో బతుకుజీవుగా అంటూ అతడు పరుగు తీశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి యువతిని కాపాడిన వృద్ధుడిని అభినందించారు. నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.