సేఫ్ జోన్ గా మారుతున్న నల్లమల
గుంటూరు, జనవరి 31,
నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన మరిన్ని డంప్‌లు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వినుకొండ నియోజకవర్గం రేమిడిచర్ల అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న డంప్ కొద్దిపాటిదే అయినప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతంలో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు, ఇతరత్రా సామగ్రిని దాచి ఉంటారనే సందేహాలు వ్యక్తవౌతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత నల్లమల అటవీ భూ ములను అభివృద్ధిపరంగా వినియోగంలోకి తీసుకురావాలని సర్కార్ భా విస్తోంది. అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే రూటు డిజైన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో నల్లమల ప్రాంతంలోకి ఇక మావోయిస్టులు పునప్రవేశం చేసే వీలులేకుండా చేసేందుకు పోలీసు యంత్రాంగం కూంబింగ్‌ను తీవ్రతరం చేసింది. దీనికితోడు కొన్ని బహుళజాతి కంపెనీలు ఇప్పటికే నల్లమల అటవీ సంపదపై కనే్నశాయి. రంగురాళ్ల తవ్వకాలు, విదేశీ డాక్యుమెంట్ల చిత్రాల పేరుతో అటవీ ప్రాంతంలో పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. వజ్రాలు, నిధి నిక్షేపాల కోసం కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు ఫ్యాక్షన్ ప్రాంతాలకు రవాణా చేసే బాంబులు, నాటు తుపాకులను కూడా కొందరు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలమైన అనంతరం 2005 తరువాత పోలీసులు నల్లమల ప్రాంతాన్ని జల్లెడపట్టారు. దీంతో ఏఒబి, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు మావోయిస్టులు మకాం మార్చారు. ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఎన్‌కౌంటర్లు, నిర్బంధం కొనసాగడంతో తిరిగి నల్లమలలో స్థావరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా తీవ్రతరం చేసి కూంబింగ్‌లు జరుపుతున్నారు. ఇదిలావుండగా మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న వెల్దుర్తి, రెంటచింతల, మాచర్ల, బెల్లంకొండ, గుత్తికొండ ప్రాంతాల్లో గ్రామాలవారీ యువత ఏయే ప్రాంతాల్లో ఉన్నారో ఆరా తీస్తున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 430 కిలోమీటర్ల మేర నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఏపిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాలకు చెందిన పోలీసులు నల్లమల అటవీ సరిహద్దుల్లో నిఘా వేశారు. మావోయిస్టు ఉద్యమ అనర్థాలను ప్రజలకు వివరిస్తూ పోలీసులు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.