ఆర్థిక అంశాలపై ఈ సమావేశంలో దృష్టి సారిస్తాం': ప్రధాని మోదీ
న్యూఢిల్లీ జనవరి 31
: ఈ దశాబ్దంలోనే మొదటిదైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు విజయవంతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. బడ్జెట్ సమవేశాలు-2020 ఇవాల్టి నుంచి ప్రారంభం కానుండటంతో పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మీడియాతో మాట్లాడారు. 'ఈ దశాబ్దంలో ఇది మొదటి సమావేశం. బడ్జెట్ సమావేశాలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాను. ఆర్థిక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారిస్తాం' అని తెలిపారు. మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆర్థిక, సాధికారిత తదితర అంశాలపై ఉభయసభల్లోనూ అర్థవంతమైన చర్చ జరగాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించిన అనంతరం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సభలో ప్రవేశపెడతారు. శనివారంనాడు బడ్జెట్-2020ను ఆమె ప్రవేశపెడతారు. కాగా, ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం సీఈఏ డాక్టర్ కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ మధ్యాహ్నం 1.45 గంటలకు మీడియాతో సమావేశమవుతారు.