సుప్రీంలో లభించని ఊరట
న్యూఢిల్లీ, జనవరి 31
ఉరి అమలుకు ఒక్క రోజు ముందు నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన జువైనల్ పిటిషన్‌ను గతంలో సుప్రీం కోర్టు కోట్టివేయగా.. ధర్మాసనం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అతడు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. 2012లో నిర్భయను రేప్ చేసే సమయానికి తాను మైనర్‌ను అని పవన్ వాదించాడు. ఇదే విషయమై గతంలో హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టివేసింది. ఇప్పుడు కూడా అదే తరహా తీర్పును సుప్రీం వెల్లడించింది.ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తాము పిటిషన్‌ను తిరస్కరించామని.. వయసు గురించి పదే పదే పిటిషన్ వేయడం సరికాదని తెలిపింది. ఇప్పటి వరకూ నిర్భయ దోషులు ముగ్గురు వేర్వురుగా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.డెత్ వారంట్ ప్రకారం నిర్భయ దోషులను శనివారం ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాల్సి ఉంది. ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.