YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 అనంతలో చిన్న పరిశ్రమలపై చిన్న చూపు

 అనంతలో చిన్న పరిశ్రమలపై చిన్న చూపు

 అనంతలో చిన్న పరిశ్రమలపై చిన్న చూపు
అనంతపురం, ఫిబ్రవరి 1,
అనంతపురం జిల్లాలో చిన్న తరహా పరిశ్రమల నిర్వహణ కడుదయనీయ స్థితికి చేరింది. మూడు సంత్సరాలలో చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేని పరిస్థితి. బడా కార్పొరేట్‌ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్న ప్రభుత్వం చిరు పరిశ్రమలపై దృష్టి సారించటం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కరువు ప్రాంతంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విభజన ప్రస్తావన ముందుకు తెచ్చిన నాటి నుంచి పరిశ్రమలకు గడ్డుకాలం ఏర్పడిందనేది వాస్తవం. జిల్లాలో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. అసలే వ్యవసాయ ఆధారిత జిల్లా కావటంతో పరిశ్రమలు శాతం తక్కువగా ఉంది. ఉన్న పరిశ్రమలకు సరైన ప్రోత్సాహం లేకపోవటంతో ఔత్సాహికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపుగా 1000కి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా పరిశ్రమల నిర్వహణ దయనీయ స్థితికి చేరిందని పరిశ్రమల యాజమానుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాలో ప్రముఖంగా గ్రానైట్‌ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. సోప్స్‌, ఫార్మా, కర్పూరం, ఐరన్‌ఒర్‌, ఐరన్‌ బేసుడ్‌ పరిశ్రమలు, పివిసి, డ్రిప్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రాలు, జీన్స్‌ ప్యాంట్ల ఉత్పత్తి కేంద్రాలు, సిమెంట్‌ పరిశ్రమలు, పాల ఉత్పత్తి కేంద్రాలు ఇలా పలు రకాల యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. ప్రధానంగా హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాలలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. పరిశ్రమలు రాష్ట్ర విభజనతో మరింత నష్టాల్లోకి వెళ్లాయి. రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టినప్పటి నుంచి చిన్నతరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు దక్కలేదు. మరో వైపు కేంద్రం ప్రభుత్వం నోట్ల రద్దు, జిఎస్‌టిని ముందుకు తీసుకురావటంతో యావత్తు పారిశ్రామిక రంగం కుదేలయింది. గతంలో వ్యాట్‌ యాక్టు లేని కారణంగా ఇన్సెంటివ్‌లు ఆశాజనకంగా ఉండేవని సేల్‌టాక్స్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానం ప్రోత్సాహకంగా ఉండేది. ప్రస్తుతం జిఎస్‌టి విధానంలో జరిగిన మార్పుల వల్ల పరిశ్రమల రంగంలో ఆందోళన నెలకొంది. ఏడాది గడిచినా నేటికీ ప్రభుత్వం జీవో విడుదల చేయకపోవటంతో ఎంతో మంది ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు. మరో వైపు చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చే విద్యుత్‌ ఇతర రాయితీలను మరింత పెంచితేనే వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. మరో వైపు మర్కెటింగ్‌ సౌకర్యం లేకపోవటంతో పారిశ్రామిక వేత్తలు రవాణా భారాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం మర్కెటింగ్‌ సౌకర్యంపై దృష్టి సారిస్తేనే చిరు పరిశ్రమల మనుగడ సాధ్యమవుతుందని కొందరు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు

Related Posts