YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 గ్రామాల్లో మళ్లీ ఎన్నికల వేడి

 గ్రామాల్లో మళ్లీ ఎన్నికల వేడి

 గ్రామాల్లో మళ్లీ ఎన్నికల వేడి
నల్గొండ, ఫిబ్రవరి 1,
జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో రాజకీయ వేడి ప్రారంభమైంది. నోటిఫికేషన్‌ వచ్చిందని తెలుసుకున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘాలుగా పేరొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయాత్తమవుతున్నది. సహకార సంఘాల పాలకవర్గం గడువు ఏడాది క్రితమే ముగియడంతో ఆరు నెలల కాలాన్ని రెండుసార్లు పెంచారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్‌లో సర్పంచ్‌ స్థానానికి పోటీ చేసే అవకాశం దూరమైన వారు సహకార ఎన్నికల వైపు దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. సహకార పాలకవర్గానికి ఎన్నికై డీసీసీబీ పదవులు చేపట్టేందుకు రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. పల్లెల్లో ‘సహకార’ సమరం షురూ కానున్నది. రైతన్నలే ప్రధాన భూమిక పోషించనున్న సహకార ఎన్నికలతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపించనున్నది. ఎన్నికల కమిషన్‌ గురువారం సాయంత్రం సహకార ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  6,7,8 తేదీల్లో నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించింది. మరోవైపు 13 సంఘాల ప్రతిపాదనలను రద్దు చేసిన ప్రభుత్వం జిల్లాలో ఉన్న 21 సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నది. సహకార సంఘాల ఎన్నికల సమరానికి తెరలేచింది. రైతన్నలే ప్రధాన పాత్ర నిర్వహించే ఎన్నికలు కావడంతో పల్లెల్లో హంగామా ఎక్కువగానే ఉంటుంది. ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించేందుకు కమిషనర్‌ వీరబ్రహ్మయ్య ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల సహకారశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సహకార శాఖ అధికారులతో విధివిధానాలపై చర్చిస్తున్న సమయంలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో నోటిఫికేషన్‌ను జిల్లా అధికారుల సమక్షంలో విడుదల చేశారు. నామినేషన్ల పర్వం ఫ్రిబవరి 6,7,8వ తేదీ వరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన 9న జరుపుతారు. 10న ఉప సంహరణలు, 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట  వరకు  పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభించి.. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. 16న అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగనుంది.ఒక్కో సహకార సంఘంలో 18 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరిలో ఐదుగురుని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. 13 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. వీరిలో ఒకటి ఎస్సీలకు, ఒకటి ఎస్సీ మహిళకు, ఒకటి ఎస్టీలకు, రెండు బీసీలకు, ఏడు ఓసీలకు, ఒకటి ఓసీ మహిళకు రిజర్వు చేస్తూ ఎన్నికల అధికారి వీ.సుమిత్ర జారీ చేసిన ఆదేశాలు రాత్రి 7 గంటల సమయంలో వెలువడ్డాయి. పాత పాలకవర్గం నేతృత్వంలోనే సహకార సంఘాల నిర్వహణ కొనసాగుతున్నది. వచ్చే నెలలో సహకార ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 21 సహకార సంఘాలు ఉండగా.. 89,950 మంది సభ్యులు ఉన్నారు. కొత్తగా ఏర్పాటవుతాయని భావించిన 13 సంఘాల ప్రతిపాదనలు రద్దు చేశారు. ఈ నెల 27 మున్సిపాలిటీల్లో ఫలితాల ప్రకటనతో మున్సిపాలిటీ ఎన్నికల సందడి ముగిసిపోగా.. గ్రామాల్లో సహకార ఎన్నికల హడావుడి మొదలైంది.గ్రామీణ ప్రాంతాల్లో రైతు సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు సహకారశాఖ ప్రాథమిక సహకార కేంద్రాలను ఏర్పాటు చేసింది. పూర్తిగా రైతులే సభ్యులుగా ఉండే ఈ సహకార సంఘాల్లో అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు మరో 13 మంది డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. మరో ఐదుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. వారంతా కలిసి ఫిబ్రవరి 16న పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. సంఘంలో బ్యాంకు ద్వారా రుణం తీసుకుని సభ్యత్వం పొందిన ప్రతి రైతూ ప్రజాస్వామ్య పద్ధతిలో సహకార సంఘ పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 21 సహకార సంఘాలుండగా.. ఒక ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సహకార సంఘం ఉంది. అయితే ఇదివరకు సంఘ సభ్యులుగా ఉన్న ఓటర్ల అభ్యర్థనపై జిల్లా సహకార అధికారి ఆధ్వర్యంలో ఓటర్ల అభ్యంతరాలపై షెడ్యూల్‌ను సైతం విడుదల చేశారు. ఆ తర్వాత జాబితా ప్రకారం ఎన్నిక నిర్వహించనున్నారు. 

Related Posts