సమ్మక్క సారలమ్మలకు హెలికాఫ్టర్ సర్వీసులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 1,
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఎడ్లబండి నుంచి హెలికాప్టర్ వరకు అని చెప్పుకునేటోళ్లం. కాలినడక, ఎడ్లబండ్లతో మొదలైన జాతర ఆపై ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, బెంజ్ కార్ల వరకు వెళ్లింది. ఇవన్నీ కాదని 2016లో మరో అడుగు పడింది. హెలికాప్టర్ సర్వీసులు స్టార్ట్అయ్యాయి. 2018 జారత టైం వచ్చేసరికి మరో రెండు ఎయిర్‍వేస్ సంస్థలు తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈసారి జాతరలో సామాన్య జనానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అనే విషయంలో అటు ప్రభుత్వం ఇటు ఎయిర్వేస్ సంస్థలు ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.గత రెండు మేడారం జాతర సమయాల్లో టూరిజం శాఖ అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్, వరంగల్ నుంచి క్షణాల్లో జాతర వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వరంగల్ నుంచి వెళ్లేవారి కోసం హన్మకొండ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో హెలిప్యాడ్తయారు చేశారు. ఆన్‍లైన్లో టిక్కెట్ బుక్ చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. పెద్దోళ్లకు రూ.12,999 ధర పెట్టారు. రెండేళ్లలోపు వయసున్న పిల్లలకు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఒక్కో రౌండులో ఆరుగురు జర్నీ చేసేలా.. రోజుకు 10 నుంచి 12 ట్రిప్పులు నడిపారు. హెలికాప్టర్‍లో వెళ్లే భక్తులకు జాతరలో వీవీఐపీ దర్శనం చేపించారు. ఇవి చాలవన్నట్లుగా జాతర పరిసరాలను 10 నిమిషాల పాటు ఆకాశం నుంచి వీక్షించేలా ఫెసిలిటీ కల్పించారు. దీనికోసం జాయ్‍రైడ్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.2,499 చొప్పున రేటు వసూలు చేశారు. ఓ వైపు హెలికాప్టర్ ఎక్కామనే ఆనందం.. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు, సమయం వృథా కాకుండా అమ్మవారి దర్శనం కావడంతో భక్తులు ఫుల్లు ఖుషీ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి వరంగల్ సిటీ నుంచి వెళ్లడానికి ఎంతో ఉత్సాహం చూపారు.మేడారంలో హెలికాప్టర్ సేవల విషయమై ఈ ఏడాది అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో తుంబి ఎయిర్‍వేస్ సంస్థతో పాటు డెక్కన్, ఎండివర్ సంస్థలు భక్తులకు హెలికాప్టర్ సర్వీసులు అందించాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు హెలికాప్టర్లు తిప్పారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి ఇవి బయల్దేరి మేడారంలోని పగిడాపూర్ హెలిప్యాడ్‌కు చేరుకునేలా రూట్ ప్లాన్ చేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు రావడానికి వారం ముందు నుంచే ఈ సేవలు అందించేవారు. ఈసారి మరో నాలుగు రోజుల్లో అమ్మవార్లు రావడానికి తోడు వారంలో జాతర సైతం ముగియనుంది. అయినా ఇప్పటివరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం కాలేదు.