YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మళ్లీ తెరపైకి మూడో ముచ్చట

మళ్లీ తెరపైకి మూడో ముచ్చట

మళ్లీ తెరపైకి మూడో ముచ్చట
బలపడుతున్న ప్రాంతీయ పార్టీలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
నాలుగేళ్ల పైచిలుకు కాలవ్యవధి ఉండగానే కేంద్రంలోని ఎన్డీఏకు ప్రత్యామ్నాయంపై చర్చ మొదలైంది. అటు కాంగ్రెసు ఇంకా పుంజుకోలేదు. అందువల్ల యూపీఏ సారథ్యం అన్న మాటకు మద్దతు దొరకడం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం పాలన విషయాలు, వివాదాస్పద అంశాల్లో విపరీతమైన దూకుడు కనబరుస్తోంది. ఈ జోరును సైద్దాంతికంగా అడ్డుకునేందుకు బలమైన ప్రాంతీయ పార్టీలు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే వాదన వినవస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కోణంలో మరో ప్రయత్నానికి ప్రాతిపదికగా నిలుస్తున్నాయి.కేంద్రప్రభుత్వ సారథ్య పార్టీ అయిన బీజేపీ తన మూల సిద్దాంతాలను ఆచరణలోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది. భావజాల పరంగానే కాకుండా పాలన విధానాల్లో సైద్దాంతిక మార్పులను ప్రవేశపెట్టేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఇందుకు లోక్ సభలో బీజేపీకి తనంతతానుగానే మెజార్టీ ఉండటానికి తోడు ప్రాంతీయపార్టీలు రాజ్యసభలో సహకరిస్తున్నాయి. ఆయా పార్టీల బలహీనతలను ఆసరా చేసుకుంటూ నయానోభయానో అన్నిటికీ ఆమోదముద్ర వేయించుకోగలుగుతోంది. పరస్పరం భిన్నధ్రువాలైన పార్టీల నుంచి సైతం మద్దతు కూడగట్టగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉప్పునిప్పులా కనిపించే వైసీపీ, టీడీపీలు కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుల విషయానికొచ్చేటప్పటికి పోటీలు పడి మద్దతునిస్తున్నాయి. ఏకపక్ష రాజకీయ ముఖచిత్రానికి ఇదో నిదర్శనంగానే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించకతప్పని అనివార్యతలో కొన్ని పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమబంగలో మమత బెనర్జీ, తెలంగాణలో కేసీఆర్ ఈ కోవకే చెందుతారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ కూడా బలమైన పక్షం. అనేక రాష్ట్రాల్లో విస్తరించిన బహుజనసమాజ్ పార్టీ జాతీయ స్థాయి కలిగిన పార్టీ. నాయకత్వ బలహీనతతో బీఎస్పీ కొన్నిచోట్ల తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇటువంటి స్థితిలో వాటన్నిటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తెచ్చే ఏకసూత్రంపై అంతర్మథనం సాగుతోంది.2019 ఎన్నికలలో కూడా ఎన్డీఏ, యూపీఏ లకు ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ తీసుకురావాలనే ప్రయత్నాలు సాగాయి. కేసీఆర్ ఈదిశలో అనేక పర్యటనలు చేశారు. పలువురు ముఖ్యమంత్రులను , ప్రతిపక్ష నాయకులను కలిశారు. కానీ ఎవరి గోల వారిదే అన్నట్లుగా తమ సమస్యల కోణంలోనే ఆయా పార్టీలు ఆలోచన చేశాయి. ఫ్రంట్ కల సాకారం కాలేదు. అదే సమయంలో ఫ్రంట్ పేరు చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు సైతం ఆరకమైన ప్రయత్నాలు చేశారు. కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏకు కొంత సానుకూలత తో కూడిన ఒక సమాఖ్యకు రూపు కట్టించాలని యత్నించారు. బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల తర్వాత కూటములు కట్టాలన్న ప్రయత్నాలు ఆలోచన దశలోనే అణగారిపోయాయి. తనకు ఎదురేలేదన్న భావనలో ఎన్నికల తర్వాత చాలా వేగంగా బీజేపీ పావులు కదపడం ప్రారంభించింది. ఇప్పటికే అయోధ్య , జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయాల్లో విజయం సాధించిన కేంద్రం తన అజెండా పరిధిని పెంచుకోవడం ప్రారంభించింది. అస్సాం వంటి కొన్ని రాష్ట్రాలకు పరిమితమైన పౌరసత్వ వివాదాన్ని దేశం మొత్తానికి వర్తింపచేసేందుకు పూనిక వహించింది. బీజేపీ జాతీయ అజెండాలో మిగిలి ఉన్న ఏకైక అంశం ఉమ్మడి పౌరస్మ్రుతి మాత్రమే. ఈ దిశలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ జాబితా వంటివి చాలా కీలకం. ఈ విషయాలను ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వర్గాల జనాభా ఓట్ల పరంగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఇక్కడే ఇరకాటంలో పడుతున్నాయి. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా పార్టీల కాతాకు మళ్లించుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించాయి.ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి కీలకాంశాలను అన్ని పార్టీలూ విస్మరిస్తున్నాయి. అందువల్లనే ఏ పార్టీ అయినా తమకు మేలు చేయదనే బలమైన నమ్మకం ఓటర్లలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రజల రోజువారీ సమస్యలు ఫోకస్ లో ఉండకుండా భావోద్వేగాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు బీజేపీ విజయం సాధిస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టాలనుకున్న ఆలోచనకు ఉమ్మడి సైద్దాంతిక అజెండా లేదు. కేవలం నరేంద్రమోడీని వ్యతిరేకించాలన్న అక్కసు మాత్రమే వారిలో కనిపించింది. పైపెచ్చు మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిని ఆవిష్కరించలేకపోయాయి. అయితే ఇప్పుడు సీఎఎ రూపంలో ఒక సైద్దాంతిక ఏకతా సూత్రం విపక్షాలకు కనిపిస్తోంది. అసెంబ్లీలో సీఎఎ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొనడంలోని ఆంతర్యమిదే. ప్రాంతీయ పార్టీలన్నిటినీ కలిపి ఫెడరల్ ఫ్రంట్ కట్టాలన్నఆయన ఆలోచనకూ ఒక ప్రాతిపదికను బీజేపీయే స్వయంగా సమకూర్చి పెట్టింది. ఆంధ్రాలో బలమైన పార్టీగా ఉన్న వైసీపీ వంటి వాటినీ తన తోవలోకి తేవాలనేది కేసీఆర్ యత్నం. అయితే ఆంధ్రాకి సంబంధించి కొన్ని రాజకీయావసరాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. మండలి రద్దు వంటివి కేంద్రంపై ఆధారపడిన అంశాలు. అలాగే రాజధాని తరలింపు, హైకోర్టు ను కర్నూలుకు పంపడం వంటివి కేంద్ర ప్రభుత్వ సమ్మతితో ముడిపడిన విషయాలే. అందువల్ల ప్రస్తుతానికి వైసీపీ నుంచి ఫ్రంట్ యత్నాలకు ప్రత్యక్ష సహకారం ఆశించడం అత్యాశే అవుతుంది.రగిలిపోతున్న ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా జట్టు కట్టడంపై ఒక నిర్ణయానికి రావాలంటే ఒక బలమైన నాయకుడు అవసరం. ఏ ఒక్కరి నేతృత్వంలోనో, ఆధిపత్యంలోనో పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీల అధినేతలు సిద్దంగా లేరు. గతంలో కేసీఆర్ ఎంతో వినయంగా ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్ద పార్టీలైన సమాజ్ వాదీ, తృణమూల్, బహుజనసమాజ్, డీఎంకేల నుంచి సానుకూలత లభించలేదు. దాదాపు ఆయా పార్టీలన్నిటికీ బీజేపీ, మోడీ వ్యతిరేకతే కాకుండా సైద్దాంతికంగా కూడా ఏక సూత్రం ఉంది. అయినప్పటికీ ఒకే దండలో దారంగా ఇమడటానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెసు పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ పార్టీ నాయకత్వంలోని యూపీఏ కూటమి బలపడితే ఫ్రంట్ వైపునకు మొగ్గు చూపే పార్టీల సంఖ్య తగ్గుతుంది. ఈ సందిగ్ధతే కేంద్రంలోని అధికారపార్టీకి అడ్వాంటేజ్ గా మారుతోంది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా సైద్దాంతికంగా ముందుకు వెళ్లేందుకు ఆయా పార్టీలకు ప్రస్తుతం బంగారం లాంటి అవకాశం లభిస్తోంది. ఎన్నికలకు చాలా సమయం ఉండటం వల్ల ఆదరాబాదరాగా హడావిడి పడాల్సిన అవసరం లేదు. అంతా కలిసి కూర్చుని ఉమ్మడి కార్యాచరణ రూపొందించు కుని ఒకే ప్లాట్ ఫారం ద్వారా ప్రజల్లోకి వెళ్లడానికి తగినంత వ్యవధి ఉంది. అయితే ఇదోపెద్ద రాజకీయ సాహసం. ఇందుకుగాను పిల్లిమెడలో గంట కొట్టేందుకు తాను సిద్దమంటున్న కేసీఆర్ కు సహకరించేవారెందరు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

Related Posts