ఉరిపై కొనసాగుతున్న సస్పెన్స్
దోషుల దొంగనాటకాలతో మళ్లీ బ్యాక్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
నిర్భయ దోషులకు అమలు చేయాల్సిన ఉరిశిక్ష నిరవధికంగా వాయిదా పడింది. డెత్ వారంట్ల అమలుపై ఢిల్లీ కోర్టు శుక్రవారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. శనివారం ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గతంలో జారీ అయిన డెత్ వారంట్లపై స్టే విధించాలని ముగ్గురు దోషులు పవన్, వినయ్, అక్షయ్ గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా విచారణ చేపట్టారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం వినయ్ దాఖలు చేసిన అభ్యర్థన పెండింగ్‌లో ఉన్నదని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. ఒకే కేసుకు సంబంధించి ఒకరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు మిగతా వారికి ఉరిశిక్ష అమలు చేయకూడదన్న నిబంధనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలని కోర్టును కోరారు. మరోవైపు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించవద్దని తీహార్ జైలు అధికారుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దోషుల ఉరిశిక్షను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సాయంత్రం వెల్లడించారు. ఉరి శిక్ష అమలు వాయిదా ఆలస్యానికి దోషులు చేస్తున్న ప్రయత్నాలను కోర్టు గ్రహించినా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులకు జనవరి 22న శిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు జనవరి 7న తొలిసారి డెత్ వారెంట్లు జారీ చేసింది. కాగా, ముఖేశ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి కోవింద్ జనవరి 17న తిరస్కరించారు. తిరస్కరణ అనంతరం ఉరి అమలుకు 14 రోజుల గడువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో వారి డెత్ వారెంట్ల అమలు తేదీని కోర్టు ఫిబ్రవరి 1కి మార్చింది. ఈ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో వినయ్, అక్షయ్ మంగళవారం క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయగా, విచారణ జరిపిన సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి వినయ్ దాఖలు చేశాడు. నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదు. దీనిపై విచారణ ముగిసిన తర్వాతే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాల్సి ఉంటుంది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌నంటూ నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. జనవరి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సమీక్షించాలంటూ శుక్రవారం అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఆర్ భానుమతి, అశోక్ భూషణ్, ఏఎస్ బోపన్నలతో కూడిన బెంచ్ తమ చాంబర్‌లో విచారణ జరిపింది. ఈ అంశంపై ఢిల్లీ ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది. దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడిన నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశా దేవి కన్నీటిపర్యంతమయ్యారు. తన ఆశలు హరించుకుపోయాయని, అయినా న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. దోషులకు జీవించే హక్కులేదు. దోషులకు ఉరిశిక్ష అమలు చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది అని మీడియాకు తెలిపారు. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల వల్లనే దోషులకు ఉరిశిక్ష అమలు కాకుండా వారి న్యాయవాదులు కాపాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దోషులకు శిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై చర్చ జరుగాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా ఉరి శిక్ష పడిన దోషులకు ఆరు నెలల్లో శిక్ష అమలు చేసేలా చట్టాలను సవరించాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొన్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.