YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*మాఘ పురాణం - 10 వ అధ్యాయము*

*మాఘ పురాణం - 10 వ అధ్యాయము*

*మాఘ పురాణం - 10 వ అధ్యాయము*
*ఋక్షకయను బ్రాహ్మణ కన్యవృత్తాంతము*
పూర్వము భృగుమహాముని వంశమునందు, ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో యిల్లువిడిచి, గంగానది తీరమునకుపోయి, ఆశ్రమము నిర్మించుకొని, శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా, చాలా సంవత్సరములు ఆచరించుటవలన, అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ, ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠమందేవుండి, తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే, బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి, "తిలోత్తమ" అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు, బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, "ఓయీ! మీకేమి  కావలయునో కోరుకొనుము" అని అనగా, "స్వామీ మాకు యితరుల వలన, మరణము కలుగకుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే యిచ్చితిని అని చెప్పి, అంతర్ధానమయ్యెను.
బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ యిద్దరు రాక్షసులును, మహాగర్వము కలవారై, దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో, మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి, దేవతలందరినీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ, సత్యలోకమునకు వెళ్ళి, బ్రహ్మను వేడుకొని, "మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు, మీరిచ్చిన వరములతో, గర్వము కలవారై, తపశ్శాలురను బాధించుచు, దేవలోకమునకు వచ్చి, మమ్మందరను తరిమి, చెరసాలలో బెట్టి, నానాభీబత్సము 
జేయుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు" మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి, తిలోత్తమను పిలిచి,  "అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు, యితరులెవరి వల్లను, మరణము గలుగదని, వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో, చాల అల్లకల్లోలము చేయుచున్నారు. కాన, నీవు పోయి, నీచాకచక్యముతో, వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము" అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి, సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని, మధురమైన పాటలు పాడుకొనుచు, ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును, ఆమె మధురగానమునూ విని, ఆ దానవసోదరులు, అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ, ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి, "నన్ను వరింపుము, నన్ను వరింపుమని, తిలోత్తమను, యెవరికివారు, బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ," ఓ రాక్షసాగ్రేసురులారా! మిమ్ములను పెండ్ళియాడుట నాకు యిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ యిద్దరియెడల, సమాన ప్రేమతోనున్నాను. కాని యిద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది. కాని నాకోరిక యొకటి యున్నది. అది ఏమనగా, మీ యిద్దరిలో ఎవరు బలవంతులో, వారికే నేను  స్వంతము కాగలను" అని చెప్పెను.
ఆమె మాటలకు, సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడననగా, నేను బలవంతునని, ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి, గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము, రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు, భయంకరంగా యుద్ధము చేసిరి. గదాయుద్ధము తరువాత, కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో, ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందునo యిద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరిl.
తిలోత్తమను, దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి, జరిగినది  తెలియపర్చగా, బ్రహ్మ సంతోషించి,"తిలోత్తమా! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము, నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"వని పంపెను.

Related Posts