YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 గుర్రుగా సీమ నేతలు 

 గుర్రుగా సీమ నేతలు 

 గుర్రుగా సీమ నేతలు 
తిరుపతి,  ఫిబ్రవరి 3,
తెలంగాణ ప్రాంతాన్ని చిన్నచూపు చూశారన్న కోణంలో అక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, ఇప్పుడు అలాంటి ఉద్యమం చేయాలన్న ఆలోచన రాయలసీమ ప్రజల్లో కలిగేలా పాలకులు వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సూచించాలని 2014లో కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ, 2019లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీలకు రాయలసీమ, అందులోనూ మాజీ రాజధాని కర్నూలు నగరం ఎందుకు కనిపించలేదో అర్ధం కావడం లేదని వారంటున్నారు. ఈ రెండు కమిటీలు కనీసం రాయలసీమలో రాజధాని ఏర్పాటుపై అభిప్రాయం కూడా వ్యక్తపర్చకపోవడం వెనుక నాటి, నేటి పాలకుల హస్తం ఉందని వారు విశ్వసిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు రాయలసీమకు చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ సీమపై నిపుణులకు స్వేచ్చనివ్వకవపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు నుంచి 1953లో విడిపోయి కొత్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి మూడేళ్లపాటు కర్నూలు రాజధానిగా సేవలందించిన విషయాన్ని పాలకులు గుర్తించకపోవడం రాయలసీమపై వారు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారన్నదానికి అద్దం పడుతోందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్రా ప్రాంతానికే ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించడాన్ని వారు తప్పుబడుతున్నారు. శివరామకృష్ణన్ నివేదికను కాదని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు, విజయవాడ నగరాల మధ్య సారవంతమైన వ్యవసాయ భూముల్లో రాజధాని నగరాన్ని నిర్మించాలని తలపెట్టారని సీమ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా జీఎన్‌రావు కమిటీ నివేదిక చేతికి రాక ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్టణం రాజధాని అని ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే కోస్తాంధ్ర నేతలకు ముఖ్యమంత్రులు బానిసలుగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. తాము బానిసలు కాదని వారంటే అత్యంత విలువైన భూముల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం వెనుక అవినీతి దాగి ఉందని అంగీకరించాల్సి ఉంటుందని సీమనేతలు పేర్కొంటున్నారు. వెనుకబాటు తనంతో విలవిలలాడుతున్న రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశముందని సూచిస్తున్నారు. శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు రాయలసీమ ప్రాంతంలో తూతూ మంత్రంగా పర్యటించి నివేదిక ఇచ్చాయని, అయితే కర్నూలు అన్నింటికీ అనుకూలమైన నగరమని ఏనాడో చెప్పారని సీమ నాయకులంటున్నారు. కర్నూలు నగరానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని గుర్తించే 1953లో ఎలాంటి వివాదాలు లేకుండా రాజధాని నగరంగా ఎంపిక చేశారని గుర్తుచేస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం గురించి రెండు కమిటీలు తెలుసుకోలేదన్న విషయం వారి నివేదికలను బట్టి స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Related Posts