YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పనులెవరు చేస్తారు.

 పనులెవరు చేస్తారు.

 పనులెవరు చేస్తారు..? (కృష్ణా జిల్లా)
తిరువూరు,ఫిబ్రవరి 03 : పశ్చిమకృష్ణాలో ప్రధాన వాణిజ్య పంటలైన మిరప, పత్తి సాగు చేసిన రైతులు కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. గత పక్షం రోజులుగా కూలీల కొరతతో పత్తి తీతలు, మిరప కోతలు మందకొడిగా సాగుతున్నాయి. అన్నదాతలు రూ.కోట్లలో నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. దాళ్వా వరినాట్లు, మిరప, పత్తి దిగుబడులు ఏకకాలంలో రావడంతో ఈ సమస్య ఏర్పడింది. గత ఖరీఫ్‌ నురచి సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో ఈ ఏడాది రబీ వరిసాగుకు మొగ్గు చూపారు. స్థానికంగా ఉండే కూలీలు వరినాట్లకు వెళుతున్నారు. మిరపకాయ కోతకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. పత్తి రైతుల పరిస్థితి డోలాయమానంగా ఉంది.  జిల్లాలో ఖరీఫ్‌లో 27వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. చేలల్లో రెండోదశ కాయ కోతలు ప్రారంభమయ్యాయి. ముదురు తోటల్లో డిసెంబరులో, లేత తోటల్లో జనవరిలో దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడి లభించింది. రెండో కోతలో మరో 10 క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. ఈ ఏడాది ఎకరాకు 30 క్వింటాళ్లపైనే దిగుబడి లభిస్తుందని ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌ కాయ ధర రూ.17వేల నుంచి రూ.18 వేల వరకు ఉంది. ఇప్పుడు సమస్యంతా కూలీల కొరతతో ముడిపడింది. రోజువారీ కూలీ రూ.300, ఆటో కిరాయి రూ.50 చొప్పున చెల్లిస్తున్నారు. కిలోల చొప్పున కిలో కాయలకు రూ.8 వరకు కూలీ తీసుకుంటారు. ఎకరంలో కాయ కోయాలంటే ఇపుడు 70 మంది అవసరం. రోజులకు ఒకరు 30 నుంచి 40 కిలోల వరకు పండుకాయ కోస్తారని, అవి ఎండితే 10 కిలోల బరువు ఉంటాయన్నారు. సకాలంలో కాయలు కోయకపోతే తాలుగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు రూ.లక్షల్లో నష్టం వస్తుందని వాపోతున్నారు. అందుకే మిరప రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. వారికి ఇక్కడే వసతులు ఏర్పాటు చేసి కాయ కోతలకు తీసుకెళుతున్నారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తికి కూలీల కొరత తీవ్రంగా ఉంది. గత పక్షం రోజుల నుంచి చేలల్లో పత్తి తీతలు నిలిచాయని వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 54వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఎకరాకు 15 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి లభిస్తుందని అంచనా ఉంది. ఇప్పటికే ఏడెనిమిది క్వింటాళ్లు దూది వచ్చింది. ప్రస్తుతం మొక్కలకు తీయాల్సిన పత్తి వేలాడుతోంది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల పత్తి లభించే అవకాశం ఉందని రైతులు వెల్లడించారు. ఇప్పుడు చెట్లకున్న పత్తి నాణ్యమైంది. వదిలేస్తే ఎండిన ఆకులు అతుక్కొని నాణ్యత లోపిస్తుంది. క్వింటాల్‌ మద్దతు ధర రూ.5550 ఉంది. ప్రస్తుతం తీసేందుకు సిద్ధంగా ఉన్న పత్తికి ఆ ధర కచ్చితంగా లభిస్తుంది. ఇక కూలీలకు రోజువారీగా రూ.300, కిలోల చొప్పున కిలోకు రూ.12 నుంచి రూ.15 వరకు చెల్లిస్తున్నారు. ఈ కొరతను అధిగమించకపోతే పత్తి రైతులు ఎకరాకు రూ.15 వేలకుపైన ఆర్థికంగా నష్టపోతారు. ఈ ఏడాది సాగర్‌ జలాలు పుష్కలంగా సరఫరా కావడం, చెరువులు, బావులు, బోర్లు, వాగుల్లో నీరు సమృద్ధిగా లభిస్తుండంతో అన్నదాతలు దాళ్వా వరి అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గు చూపారు. ఫలితంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే కూలీలను రబీ వరి నాట్లకు తీసుకెళుతున్నారు. వారు మాగాణి భూముల్లో నాట్లు వేయడంలో నిమగ్నమవ్వడంతో పత్తి, మిరప పంటలకు అందుబాటులో లేరు. వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి మిరపకాయ కోతలకు కూలీలు వలస వస్తారు. వీరే గ్రామాల్లో వ్యయసాయ పనుల్లో దర్శనమిస్తున్నారు. రబీలో ఎకరాకు వరినాట్లకు రూ.3500 వరకు కూలీలకు చెల్లిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, ఎ.కొండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాముల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి సేకరిస్తున్నారు. సెలవుల నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి కొనుగోళ్లు నిలిపివేశారు. ఇక్కడి కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ.5,550 మద్దతు ధర చెల్లిస్తుండగా, కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక అవసరాలను అవకాశంగా తీసుకుని క్వింటాల్‌కు రూ.4,500 మాత్రమే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా కూలీల కొరత కారణంగా పత్తి తీతలు నిలిచిపోయాయి.

Related Posts