విద్యా వెలుగులు (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, ఫిబ్రవరి 03: గిరి బిడ్డల్లో విద్యా వెలుగులు నింపడానికి, వారిలో ఆర్థిక, సామాజిక మార్పులు తేవడానికి మంచి చదువులు అందించడమే మార్గమని గుర్తించి ఏర్పాటుచేసిన ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాలకు మహర్దశ పట్టనుంది. ఆదివాసీ, గిరిజనులు ప్రగతిపథంలో దూసుకెళ్లడానికి చదువే సోపానంగా నిలుస్తోందనే ఆలోచనతో వారికి కేంద్రీయ విద్యా విధానం, ఆంగ్ల మాధ్యమంలో గుణాత్మక విద్యాబోధనను అందించి వారి ఉన్నతికి ఊతమిచ్చే దిశగా చర్యలు చేపట్టింది. పాఠశాలలకు కొత్త భవనాలు, ఆధునిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. భవన నిర్మాణాలు, క్రీడా మైదానాల కోసం అవసరమైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. పనులు ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి వసతులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణ అమలుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఉవ్ముడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గిరిజన బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెండు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. గిరిజన బాలికల కోసం ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో గిరిజన బాలుర కోసం కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో నెలకొల్పారు. నవోదయ విద్యాలయాల మాదిరి ఆధునిక సౌకర్యాలతో విద్యాబోధనను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఉట్నూరులోని బాలికల ఏకలవ్య గురుకుల విద్యాలయం కోసం ఇక్కడి కుమురం భీం ప్రాంగణంలోని మైదానంలో 10 ఎకరాల భూమిని, కాగజ్‌నగర్ బాలుర పాఠశాల కోసం 13 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. విద్యార్థులకు అన్ని రకాల ఆధునిక వసతుల కల్పనలో భాగంగా విశాలమైన మైదానంలో అన్ని ఆధునిక పద్ధతిలో భవనాన్ని నిర్మించనున్నారు. పిల్లలను ఆకర్షించేలా పాఠశాల గోడలపై రంగురంగుల బొమ్మలు, పిల్లలు కూర్చోడానికి అనువుగా ఉండే చిన్న బల్లలు, కుర్చీలు, బ్యాగుల భారం లేకుండా డెస్క్‌లు, కృత్యాధార బోధన గది, ఎల్‌సీడీ, ప్రొజెక్టర్, దుమ్ము పడకుండా ప్రత్యేకించిన బోర్డుల ఏర్పాటు, ఆట వస్తువులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, వంటగది, ప్రహరీ నిర్మించనున్నారు. సిబ్బంది కోసం స్టాఫ్ క్వార్టర్లు, ప్రతి పాఠశాలలకు ఒక గ్రంథాలయం, డార్మెంటరీ గది, క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉట్నూరు, కాగజ్‌నగర్‌లోని ఏకలవ్య విద్యాలయాలు ప్రస్తుతం తాత్కాలిక భవనాలలో నడుస్తున్నాయి. అరకొర సౌకర్యాల మధ్య విద్యాబోధన సాగుతోంది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందు కోసం ఒక్కో విద్యాలయానికి రూ.35కోట్ల చొప్పున రెండింటిని కలిపి రూ.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏకలవ్య ఆదర్శ పాఠశాలలలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్ ద్వారా విద్యాబోధనను అందించనున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసంతో పాటు సామాజిక అభివృద్ధి సాధించేలాప్రోత్సహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6 తరగతిలో మాత్రమే ప్రవేశాలను ఆహ్వానించనున్నారు. ప్రవేశాల కోసం ప్రత్యేకించి పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ చూపిన గిరిజన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, షూలు, కాస్మోటిక్స్‌తోపాటు నాణ్యమైన భోజనం, వసతి కల్పిస్తారు.