నాలుగేళ్ల నుంచి ముందుకు సాగని ఐటీఐఆర్ ప్రాజెక్టు
హైద్రాబాద్, ఫిబ్రవరి 3,
హైదరాబాద్‌కు మూడువైపులా రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ఉంది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (49,913 ఎకరాలు)లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. సైబరాబాద్ డెవలప్‌మెంట్ ఏరియా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఏరియా, ఉప్పల్ పోచారం ప్రాంతాల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా మాదాపూర్, గచ్చిబౌలి, ఆర్థిక జిల్లా మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్‌పల్లి, మహేశ్వరం మండలంలోని ఫాబ్‌సిటీ, ఈ-సిటీ, హార్డ్‌వేర్‌పార్క్‌్, జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం ప్రాంతాలను గుర్తించింది. దీనిలో జవహర్‌నగర్, ఉప్పల్, పోచారం ప్రాంతాలు ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో నెలకొని ఉన్నాయి.ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగంలో రూ.1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ రంగంలో రూ. 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావించారు. రెండు దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టు మొదటి దశ 2013-18 వరకూ, రెండవ దశ 2018-38 వరకూ పూర్తి కావాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకూ కొత్త అనుమతులు రాలేదు. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్‌లో 5.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీ పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. కనీసం మొదటి దశ ప్రతిపాదన సమయం పూర్తయ్యే నాటికయినా అనుమతులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం వేచి చూస్తోంది. కాగా మరో ప్రధాన ప్రాజెక్టులు రైల్వే రంగంలో ఉన్నాయి. మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రెండోదశకు సూచనాప్రాయ అనుమతులున్నా నిధుల కేటాయింపులే జరగలేదు. మెట్రోరైలు ప్రాజెక్టు పీపీపీ (ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్)లో ఉన్నది. అయితే ఎంఎంటీఎస్ 2003 నుంచీ ఉనికిలో ఉన్నది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లు కేంద్రబిందువుగా ఫలక్‌నుమా - లింగంపల్లి, నాంపల్లి - లింగంపల్లి, సికింద్రాబాద్ - నాంపల్లి కారిడార్లను కలుపుతూ 27 స్టేషన్ల ద్వారా ప్రస్తుతం ఎంఎంటీఎస్ నడుస్తోంది. ప్రస్తుతం లక్షన్నర మంది ప్రయాణికులకు అనువుగా ఉన్న ఈ వ్యవస్థను మరో 5 లక్షల మందికి విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రెండో దశ 2017 జూన్ నాటికి పూర్తి కావాలి. ఇంత వరకూ అతీగతీ లేదు. రెండోదశ తొలి విడతలో ఘట్‌కేసర్ - మౌలాలి (14 కి.మీ.), మౌలాలీ - సనత్‌నగర్ (23 కి.మీ.), ఐదు కొత్త స్టేషన్ నిర్మాణాలు, సికింద్రాబాద్ - బొల్లారం - మేడ్చల్ (28 కి.మీ) విస్తరించాలి. దీనిలోనే డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కూడా కలిసి ఉన్నాయి.మెట్రో రెండోదశలో ఏడు రూట్లలో 85 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మించాలని ప్రతిపాదన. ఇందుకు కేంద్రం సూచన ప్రాయంగా అనుమతించింది. ప్రస్తుతం మూడు కారిడార్లలో 72.16 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. త్వరలో మొదటి దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండవ దశకు అనుమతులు రాలేదు.