9న స్వామి వారికి గరుడ సేవ
తిరుమల, ఫిబ్రవరి 4,
తిరుమలలో ఈ నెల తొమ్మిదో తేదీన పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ రోజు రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు సర్వాలంకారుడైన మలయప్పస్వామి గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపింది. దివ్యప్రబంధ పా రాయణ మహోత్సవంలో 200 మంది స్వా మివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారని, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి పారాయణదారులను ఆహ్వానించినట్టు పేర్కొన్నది. తిరుమలలోని ఆస్థాన మండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం ఉంటుందని, పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొని సందేశమిస్తారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా సమర్పించిన వాచీలను ఈ నెల 10 నుంచి 12 వరకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఈ-వేలం నిర్వహిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. స్వామివారికి కానుకలుగా వచ్చిన క్యాషియో, టైమెక్స్, అల్విన్, టైమ్స్, సొనాటా, టిస్సాట్, ఫాస్ట్‌ట్రాక్ తదితర కంపెనీల వాచీలు ఉన్నాయని తెలిపింది. వివరాలకు 0877-226 4429లో, టీటీడీ వెబ్‌సైట్ www.tiruma la.org లేదా www. konugolu.ap. gov.in లోగానీ సంప్రదించాలని కోరింది.