మామ్మ...తాతయ్యలు మిస్సింగ్....
ఏటేటికి పెరుగుతున్న అదృశ్యం కేసులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 4,
వృద్ధుల మిస్సింగ్ కేసులు పోలీసులను కలవరానికి గురిచేస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 60 ఏండ్లు దాటిన వారే అధికంగా అదృశ్యమవుతున్నట్లు ఇటీవల నమోదవుతున్న ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో చాలామంది తమ పిల్లలు తమను సరిగా చూడడంలేదని దీంతో అవమానభారానికి గురై ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతుండడంతో వారి కోసం గాలించడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. దీనికి తోడు చాలా మంది పిల్లలు విదేశాల్లో ఉంటుండడంతో తల్లిదండ్రుల బాధ్యతను కేర్‌టేకర్‌కు అప్పజెప్పుతుండడం కూడా వృద్ధులను కష్టాల పాలు చేస్తుండడంతో వారు ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు ఇటీవల నమోదైన ఫిర్యాదులతో తెలిసింది. వృద్ధులు మిస్సింగ్ అయినప్పుడు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆలస్యమయితే ఆచూకీ దొరకడం కష్టంగా మారుతుంది. ఆలస్యం జరుగుతుంటే వారి రక్షణకు ప్రమా దం ఏర్పడుతుంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2018 సంవత్సరంలో వృద్ధులకు సంబంధించి 179 మిస్సింగ్ కేసులు నమోదు కాగా అందులో 151మంది ఆచూకీదొరికడంతో వారిని కుటుంబసభ్యులకు అప్పగించారు. 2019 ఏడాదిలో 193 వృద్ధుల మిస్సింగ్ కేసుల నమోదయ్యాయి. అందులో 143 మిస్సింగ్ కేసుల మిస్టరీ వీడిపోయింది. సైబరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆసరాతో చాలామంది వృద్ధులను సంరక్షించి వారిని స్వచ్ఛం ద కేంద్రాలకు పంపి పోలీసులు వారికి అండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వృద్ధుల సంరక్షణకు సంబంధించి సైబరాబాద్ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని పలు భద్రత సూచనలు జారీ చేశారు.
అల్జీమర్స్, వయస్సు పెరగడం కారణంగానే వృద్ధులు అదృశ్యమవుతున్నారు.
వారి పిల్లలు సరిగా చూడడం లేదనే అవమాన భారంతో చాలామంది వృద్ధులు స్వయంగా తామే ఇంటి నుంచి చెప్పపెట్టకుండా వెళ్లిపోతున్నారు. అప్పులు, ఆర్థిక నష్టాలు కారణాలతో కూడా వృద్ధులు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు.మతిమరుపు, మతిస్థిమితం సరిగాలేని పెద్దల జేబులో చిరునామా, ఫోన్ నంబరు రాసి పెట్టాలి. తప్పిపోతే ఎవరికైనా కనబడితే ఈ వివరాలతో వారిని ఇంటికి సులభంగా చేర్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉంటే పిల్లలు వారి తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్‌లను నియమించుకోవాలి. దీని కోసం కేర్‌టేకర్ పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లను సేకరించి పెట్టుకోవాలి. తరచుగా ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడాలి. వృద్ధులు ఒంటరిగా ఉండే ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒంటరిగా ఉండే వృద్ధులు వారి సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదు చేసుకోవాలి. వృద్ధులు తప్పిపోయి కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారం అందించాలి.