ఏప్రిల్ 18 నుండి 22 తేదీ వరకు హైదరాబాద్ లో జరుగుతున్న సీపీఎం పార్టీ 22 వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రోజు సీపీఎం కార్యాలయంలో "గోడ పత్రికలను" విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుబ్బిరెడ్డి, పట్టణ కార్యదర్శి జి.ఎల్.నరసింహులు కమిటీ సభ్యులు హరినాథ్ రెడ్డి,రామ్మోహన్,జగన్,ప్రశాంత్, సూర్య శేఖర్ రెడ్డి,కృష్ణానాయక్,నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఎం పార్టీ గత మూడు సంవత్సరాలుగా నిర్వహించిన పోరాటాలను సమీక్ష చేసుకొని,కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను చర్చించి భవిష్యత్తులో సీపీఎం పార్టీ చేపట్టాల్సిన ఉద్యమాలను రూపొందించడమే ఈ మహాసభల కర్తవ్యం. ప్రతి మూడు సంవత్సరాలకొకసారి సిపిఎం అనుసరించిన రాజకీయ ఎత్తుగడలను సమీక్ష చేసుకుని అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను లోతుగా చర్చించి ప్రజా ఉద్యమాలను ఏ రూపంలో చేపట్టాలో ఈ మహాసభలో చర్చ జరుగుతుందన్నారు. కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలను తీసుకుంటూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మనం చూశామన్నారు. అనేక ప్రాంతాల్లో మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే సంఘ పరివార్ శక్తులు దాడులు కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు ను బయటకు తీస్తామని ప్రతి అకౌంట్లో లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిన మాటలను నీటిమీద రాతలు గా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు మాటమార్చి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపితో జతకట్టి హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత తమ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలుగుదేశం విస్మరించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ప్రజల తరపున దేశ మరియు రాష్ట్ర అభివృద్ధి విధానాల కోసం పోరాడటానికి ఈ మహాసభలు వేదిక అవుతాయని అన్నారు.