YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యువరాజు పట్టాభిషేకం దిశగా అడుగులు

యువరాజు పట్టాభిషేకం దిశగా అడుగులు

యువరాజు పట్టాభిషేకం దిశగా అడుగులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 4,
తెలంగాణ సీఎంగా కేటీఆర్.. రెడీ అయిపోయారా.. తెర వెనుక టీఆర్ఎస్ యువరాజు పట్టాభిషేకం గురించి ఏ మేర ఏర్పాట్లు చేస్తుంది. పుర ఎన్నికల విజయం సాధించిన తర్వాత కేటీఆర్ కు మరిన్ని బాధ్యతలు పెరగనున్నాయా.. లేదా సీఎం సీట్‌లో ఆయనే ఉండనున్నారా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చ.హుజూర్‌‌నగర్‌లో బై ఎలక్షన్‌లో బంపర్‌ విక్టరీతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా. రెండింటిలోనూ కీలకంగా వ్యవహరించింది కేటీఆరే. ఇటీవల పుర ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారా అనే దానిపైన స్పష్టత ఇవ్వకపోయినా రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఆ సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది వాతావరణం.తెలంగాణలో భారీగా ఐఎఎస్‌ల బదిలీ చర్చనీయాంశమైంది. ఐఎఎస్‌ల ట్రాన్స్‌ఫర్‌ సర్వసాధారణమే అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వరకూ ఏకంగా 50 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ స్థాయిలో బ్యూరోక్రాట్లను బదిలీ చేయడం ఇదే తొలిసారి. ఈ బదిలీల ప్రక్రియలోనే ఏకంగా 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. దాదాపు ఏడాదిన్నరగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 16 మంది సబ్‌ కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చారు. వారందరినీ ఐటీడీఏ పీవోలు, మునిసిపల్‌ కమిషనర్లుగా నియమించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా కీలకమైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించిన రజత్‌ కుమార్‌ను ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. విద్యా శాఖ కార్యదర్శిగా ఉన్న బి.జనార్దన్‌రెడ్డిని వ్యవసాయ శాఖకు బదిలీ చేసి... ఆయన స్థానంలో స్పెషల్‌ సీఎస్‌ చిత్రా రామచంద్రన్‌ను నియమించారు. సీఎం కార్యదర్శిగా ఉన్న సందీప్‌ కుమార్‌ సుల్తానియాను పంచాయతీరాజ్‌కు బదిలీ చేశారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ను పరిశ్రమల శాఖ కమిషనర్‌గా నియమించారు. తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను ఇప్పుడు మళ్లీ అదే శాఖ కమిషనర్‌గా పంపించారు.పట్టణ పరిపాలనను ఉరకలెత్తిస్తామన్న కేటీఆర్‌.. ఐఏఎస్‌ పోస్టింగుల్లో మార్కు చూపించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్‌ కమిషనర్లుగా, GHMC అదనపు కమిషనర్లుగా 2014-16 బ్యాచ్‌లకు చెందిన యువ ఐఏఎస్‌లను నియమించారు. నలుగురు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లతో పాటు కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌, నిజాంపేట మునిసిపల్‌ కమిషనర్లుగా యువ ఐఏఎస్‌లను నియమించారు. వీళ్లందరి నియామకం వెనుక కేటీఆర్ ముద్ర ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల తర్వాత లేదా.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత కేటీఆర్ పట్టాభిషేకాన్ని పూర్తి చేసేట్లుగా కేసీఆర్ కనిపిస్తున్నారు. నిజానికి తానే సీఎంగా కొనసాగుతానని సాక్షాత్తూ అసెంబ్లీలోనే కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కేటీఆర్‌ కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంచితే, ఇటు కేసీఆర్‌కు సన్నిహితులైన మంత్రులు, అటు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రులు మాత్రం కాబోయే సీఎం కేటీఆర్‌ అంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు.సీఎం, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆరే అయినా.. ఆయన తరఫున అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో కేటీఆర్‌ అన్నీ తానే అయి నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌కు కేసీఆర్‌ పెట్టిన ఆఖరి పరీక్షే మున్సిపల్‌ ఎన్నికలు. అక్కడ కూడా ఆయన ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. వందకు మున్సిపాలిటీలు.. అన్ని కార్పొరేషన్లను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారు. 80శాతం పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుని టీఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని నిరూపించారు. ప్రభుత్వంపై విమర్శలతో దాడి చేస్తోన్న ప్రతిపక్షాలకు మున్సిపాలిటీ ఫలితాలతోనే సమాధానమిస్తామన్నారు కేటీఆర్.  చెప్పినట్టుగానే మున్సిపోల్స్‌లో ప్రజల పల్స్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తేటతెల్లం చేశారు.గ్రేటర్‌ ఎన్నికల తర్వాత కేటీఆర్‌కి సీఎం కేసీఆర్ ప్రమోషన్‌ ఇచ్చారు.  ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా కేటీఆర్‌కి ప్రమోషన్‌ ఉంటోందన్న ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ వందకు వందశాతం సక్సెస్‌ అయ్యారని ఆ పార్టీ నేతలు, మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రమోట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోందికాబోయే సీఎం కేటీఆర్‌ అనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌లోని కిందిస్థాయి కేడర్‌ కూడా విశ్వసిస్తోంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదట కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పంచాయతీ, పరిషత్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను విజయ పథంలో నడిపించారని పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కొనియాడారు. కేటీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా లేకపోవడం ఇబ్బందిగా మారిందని... వెంటనే ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకోవాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కొద్ది రోజులకే సీఎం కేసీఆర్‌ చేపట్టిన కేబినెట్‌ విస్తరణలో కేటీఆర్‌కు మంత్రి పదవి దక్కింది. మళ్లీ ఇప్పుడు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్‌ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవన్‌ నుంచి కేటీఆర్ పాలన సాగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కేటీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటే.. ఎక్కడ కూర్చోవాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ చాంబర్‌ కావాల్సిందే. అందుకే ఆగమేఘాల మీద మెట్రో భవన్‌లో చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారని పింక్‌ టీమ్‌లో కూడా చర్చ నడుస్తోంది. తెలంగాణ సెక్రటేరియట్‌లో అంతా ఆ ఛాంబర్‌ గురించే తెగ మాట్లాడేసుకుంటున్నారు. బేగంపేట్‌ మెట్రోభవన్‌లో ఓ ఛాంబర్‌ను అధికారులు శరవేగంగా రెడీ చేస్తున్నారు. నాలుగో అంతస్తులోని ఆ చాంబర్‌ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అప్పటివరకూ అక్కడ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చాంబర్‌ ఉంటే... ఆయన్ను అక్కడ్నుంచి ఖాళీ చేయించి అదిరిపోయే హంగులతో నయా చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇదంతా ఎవరికి కోసం అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చాంబర్‌లోకి కేటీఆర్‌ ఎంట్రీనే తరువాయి అన్న మాటలు మోతమోగిపోతున్నాయి.ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యసభకు వెళ్లి, కేటీఆర్‌ను సీఎంను చేస్తే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. ఇందుకు సమాధానంగా కేసీఆర్‌ కుమార్తె కవిత అయితేనే కరక్ట్‌ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. గజ్వేల్‌ నుంచి కవితను గెలిపించుకొని, మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోందని జనాలు అనుకుంటున్నారు. మరి కేసీఆర్‌ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

Related Posts