YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

13 వేల కోట్లు ఆదాయం లక్ష్యంగా అడుగులు

13 వేల కోట్లు ఆదాయం లక్ష్యంగా అడుగులు

13 వేల కోట్లు ఆదాయం లక్ష్యంగా అడుగులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 4,
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్ వల్ల పెద్ద షాక్ తగిలింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంచనాలు తప్పి ఏకంగా రూ.6,260 కోట్లకు కోత పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల ఒకవైపు రాష్ట్ర సొంత ఆదాయం ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. మరోవైపుకేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాకు భారీ కోత పడింది. ఈ లోటును ఏవిధంగా పూడ్చుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంపై ఆర్థిక వ్యవహారాల నిపుణులు, సలహాదారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుచర్చిస్తున్నారు. కేంద్రం చెల్లించాల్సిన వాటాలో కోత, తగ్గిన రాష్ట్ర ఆదాయంతో ఈ నెల మూడవ వారంలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్పులు, మార్పులపై నిపుణులు, సలహాదారులతో చర్చిస్తున్నారు. తగ్గనున్న ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఆనే్వషిస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో నిరర్ధకంగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మడం ఒక ప్రతిపాదనగా భావిస్తున్నారు. అలాగే భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచడం కూడా మరో ఆదాయ మార్గంగా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై 2019-20 బడ్జెట్‌లో కూడా రూ.10 వేల కోట్లను ప్రతిపాదించింది. ప్రభుత్వ భూముల విక్రయించే ప్రతిపాదన కొత్తదేమీ కాదు. ప్రతిసారి బడ్జెట్‌లో ప్రభుత్వ భూముల అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తూనే ఉంది. అయితే రాష్ట్ర ఆదాయం బాగానే ఉండటంతో భూముల అమ్మకం ప్రతిపాదనను పక్కన పెట్టింది. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర సొంత ఆదాయం తగ్గడంతో పాటు కేంద్ర బడ్జెట్ కూడా నిరాశాజనకంగా ఉండడంతో భూముల అమ్మకం ఈ ఏడాది అనివార్యం కావచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. అయితే సవరించిన కేంద్ర బడ్జెట్ అంచనాలతో ఇది రూ.15,987 కోట్లకు తగ్గింది. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో రూ.3,731 కోట్లకు కోత పడింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం 2020-21లో కేంద్రం రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలోరూ.2,381 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. పట్టణాభివృద్ధికి రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో కూడా కేంద్రం కోత పెట్టింది. దీంతో రాష్ట్రానికి దాదాపు మరో రూ.150 కోట్లు తగ్గనున్నట్టు అంచనా వేసింది. మొత్తంగా రాష్ట్రం ఆశించిన, అంచనా వేసిన దానిలో రూ.6,260 కోట్లకు కోత పడింది. దీనిని పూడ్చుకోవడానికి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడం ద్వారా రూ.3 వేల కోట్లు, ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా రూ. 10 వేల కోట్లు మొత్తంగా రూ.13 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో సగం డబ్బును సమకూర్చుకోగలిగినా కేంద్రం కోత పెట్టిన మొత్తాన్ని అధిగమించవచ్చని ఆర్థిక శాఖ యోచిస్తోంది.

Related Posts