టెక్ విద్య (ప్రకాశం)
ఒంగోలు, ఫిబ్రవరి 04 : ప్రభుత్వ పాఠశాలలకు సాంకేతికత చేరువవుతోంది. ప్రైవేటుకు దీటుగా ఇప్పటికే డిజిటల్ తరగతులు జరుగుతుండగా రానున్న విద్యాసంవత్సరం నుంచి వర్చువల్ బోధన ప్రారంభం కానుంది. గత ప్రభుత్వ హయాంలో వీటికి బీజం పడగా ప్రస్తుతం వాటిని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలిదశలో 260 జిల్లా పరిషత్, పురపాలక, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో ఇది అమలు కానుంది. విద్యార్థులకు దృశ్యశ్రవణం ద్వారా పాఠాలు త్వరగా అర్థమవుతాయనే ఆలోచనతో వర్చువల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. బోధన చేసే ఉపాధ్యాయుడితో నేరుగా మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో 120 చోట్ల ఫైబర్ నెట్ కనెక్షన్ ఇచ్చారు. మిగిలిన వాటికి త్వరలో నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన పాఠశాలల్లో ఇటీవల ట్రయిల్ రన్ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో ప్రారంభమైన స్టూడియో నుంచి కనెక్షన్ తీసుకొని ప్రసారం చేశారు. ఈ విధానంలోనే ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ కూడా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కలెక్టర్ భాస్కర్ స్టూడియోను పరిశీలించి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక చేసిన అన్ని పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. దీనికోసం సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.వర్చువల్ తరగతులు నిర్వహించే పాఠశాలకు రూ.4 లక్షలు చొప్పున వ్యయం చేశారు. అవసరమైన పరికరాలను రాష్ట్రస్థాయిలోనే కొనుగోలు చేసి అందజేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టూడియో కోసం రూ.30 లక్షలు వెచ్చించారు. మరో రూ.8 లక్షలు అవసరమని అంచనాలు వేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. బోధన చేయడానికి ఆసక్తి గల వారిని దరఖాస్తు చేసుకోవాలని కోరగా 90 మంది ముందుకొచ్చారు. వారికి టీఏ, డీఏ, గౌరవ పారితోషికం చెల్లించే అంశం పరిశీలనలో ఉంది. షెడ్యూలు ప్రకారం ఎవరు ఏ సబ్జెక్టును ఏ రోజు బోధించాలనేది త్వరలో నిర్ణయిస్తారు. వారికి గురువారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో రోజుకు నాలుగు పిరియడ్లు వర్చువల్ బోధన జరపాలని ప్రతిపాదించారు. ముందుగా షెడ్యూలు ప్రకటిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 15 మందిని జట్టుగా ఎంపిక చేసి బోధన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా టైం టేబుల్ రూపొందిస్తారు.