YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ దూకుడు నిర్ణయాలపై సెటైర్లు

జగన్ దూకుడు నిర్ణయాలపై సెటైర్లు

జగన్ దూకుడు నిర్ణయాలపై సెటైర్లు
విజయవాడ, ఫిబ్రవరి 5,
అదేంటో జగన్ కి తన తండ్రి వైఎస్సార్ అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు ఉన్నా ఆయనకు అంతకంటే స్పూర్తి ప్రదాతగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆరే అయిపోతున్నారు. జగన్ పోకడలు, ఆవేశం అన్నీ కూడా అచ్చం అన్నగారినే తలపునకు తెస్తాయి. ఎన్టీఆర్ మాదిరిగా హావభావాలు, ఉపన్యాస ధాటి లేకపోవచ్చు కానీ ఆయన పాలనా శైలి మాత్రం జగన్ కి అచ్చుగుద్దినట్లుగా అబ్బేసిందని ఈ రెండు పాలనలను చూసిన వారు అంటున్న మాట.ఇక అన్న గారి ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ కూడా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో తీసుకున్నవే. ఆయన హఠాత్తుగా కరణం మునసబు వ్యవస్థలను రద్దు చేసినా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసుని 58 నుంచి 55కి కుదించినా, 1984లో సుదీర్ఘకాలం ఎన్జీవోలు సమ్మె చేస్తే మొండిగా అడ్డుకోవడానికి చూసినా ఇవన్నీ కూడా అన్నగారి ఆవేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అంటారు. కొన్ని విషయాలను గోటితో పోవాల్సినవి గొడ్డలి వరకూ కధ తెచ్చుకున్నారని అన్న గారి విషయంలో చెబుతారు. దానికి కారణం ఆయనలో ఉన్న ఆవేశం, ప్రజలకు వెంటనే ఏదో చేయాలన్న తాపత్రయం. పర్యవశానాలు గ్రహించలేని రాజకీయ అనుభవ లేమి.ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయనలో కూడా ఆవేశం చాలా హెచ్చుగా ఉందంటారు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆరు నూరు అయినా వెనక్కు తగ్గరని కూడా చెబుతారు. జగన్ ఏ ముహూర్తంలో నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కానీ ఆయన మనసులో పుట్టిందంటే అది అమలుకావాల్సిందేన‌ని కూడా అంటారు. జగన్ తొందరపాటు నిర్ణయాలు ఆయన ఎనిమిది నెలల పాలనలో ఎన్నో కనిపిస్తాయి. ప్రజా వేదికను తొమ్మిది కోట్లతో గత సర్కార్ నిర్మిస్తే దాన్ని ఒక్క ఉదుటున జగన్ కూల్చేసారు. ఇది అక్రమ కట్టడం అయినప్పటికీ సొమ్ము మాత్రం ప్రజలదే. ఇక ఇసుక పాలసీ విషయంలో జగన్ సర్కార్ చేసిన తాత్సారం, అప్పటిదాకా ఉన్న పాత పాలసీని రద్దు చేయడం వల్ల అయిదు నెలల పాటు ఇసుకే బంగారం అయింది. చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. మధ్యతరగతి ఇబ్బందులు పడ్డారు.ఇక ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనా కూడా అలాంటి నిర్ణయమే. మంచి చెడులను చూడకుండా జగన్ ఈ విషయంలో దూకుడుగా వెళ్తున్నారనే అంటారు. మూడు రాజధానుల కధ వీటిని మించిన పరాకాష్టగా చెబుతారు. జగన్ మూడు రాజధానుల విషయంలో ఇపుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన నిర్ణయం మంచిదే కావచ్చు, కానీ పది మందితో చర్చలు జరిపి ప్రజాస్వామ్యయుతంగా తుది నిర్ణయం తీసుకుంటే ఆక్షేపించేవారు ఉండరు. అది లేకనే ఇపుడు పెద్ద రచ్చగా మారింది. ఈ నిర్ణయం కోసం ఆయన ఏకంగా శాసనమండలిని రద్దు చేసేశారు.ఓ విధంగా ప్రజా సమస్యలపైన చర్చలకు మరో సభ ఉండడం మంచిదే. రాజకీయాలు ఎక్కడ లేవు. పార్టీలు ఉన్న ప్రతీ చోటా అవి ఉంటాయి. తెలివిగా పరిష్కారం చూసుకోవాల్సింది పోయి ఉన్నదాన్ని రద్దు చేసుకోవడం అంటే ముఖం మీద కోపంతో ముక్కు కోసుకున్నట్లేనని అంటున్నారు. మొత్తానికి 1983 నుంచి 1989 వరకూ తొందరపాటు నిర్ణయాలతో ఎన్టీఆర్ తన అపరిమితమైన ప్రజాదరణను ఎలా నేలపాలు చేసుకుని అధికారం కోల్పోయారో అంతా చూశారు. మరి యువకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జగన్ చరిత్ర పాఠాలు నేర్చుకోకపోతే ఎలా అంటూ స్వపక్షంలోనే నిరసన గొంతులు వినిపిస్తున్నాయి.

Related Posts