YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 తెలంగాణలో జీవోల సర్కార్

 తెలంగాణలో జీవోల సర్కార్

 తెలంగాణలో జీవోల సర్కార్
హైద్రాబాద్, ఫిబ్రవరి 5,
టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల అమలు పట్ల జాప్యం జరుగుతోంది. నిధులు విడుదల చేస్తున్నట్టు బీఆర్‌వోలు ఇవ్వడం, ఆ తర్వాత మంజూరు చేయకుండా పెండింగ్‌లో పెట్టడం రివాజుగా మారింది. దీంతో సంబంధిత పథకాల కింద లబ్దిపొందుతున్న పేదలకు ఎదురు చూపులు తప్పడం లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, దానికి ఆర్థిక శాఖ అడ్డు చెప్పడం పరిపాటిగా మారింది. ఫలితంగా రాష్ట్రంలో గత ఏడాది కాలంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. మరీ ప్రధానమనుకున్న శాఖలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకనుణంగా నిధులు విడుదల చేయలేమని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా శాఖాధిపతులకు స్పష్టం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నిధుల మంజూరు గురించి ఆదేశాలు ఇవ్వడం, దాన్ని ఆర్థిక శాఖ అధికారులు పెండింగ్‌లో పెడుతుండటం ఆనవాయితీగా మారింది. దీంతో సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. జీవోలు విడుదలైన వెంటనే వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు, వివిధ సంఘాల నేతలు నిధులు విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నారనీ, ఆర్థిక శాఖ నుంచి తమకు నిధులు రాలేదని చెప్పినా వినడం లేదని అంటున్నారు. తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌ మెంట్‌, రుణాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం సర్కారు విడుదల చేసిన జీవోలు పెండింగ్‌లోనే ఉన్నాయని సంక్షేమ శాఖ అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు సంబంధించి రూ.750 కోట్లు విడుదల చేస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌లో మరో రూ.2,500 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. నిధుల లేమి కారణంగా ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికీ ఆ జీవోను పెండింగ్‌లోనే పెట్టారు. కులవృత్తులను ఆదుకోవడానికి కోసం 2018 మార్చిలో రూ. 2వేల కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ అధికారులు అందులో నుంచి కేవలం రూ.200 కోట్లు మాత్రమే అప్పట్లో విడుదల చేశారు. నాయిబ్రాహ్మణ, రజక ఫెడరేషన్లకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయించిన రూ.1000 కోట్లలో నుంచి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేస్తూ గత జూలైలో ఆదేశాలిచ్చింది.ప్రభుత్వ ప్రాధాన్యతలు పూర్తిగా మారాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం అని చెప్పిన సర్కారు.. తర్వాతా ఆ శాఖను పూర్తిగా విస్మరించింది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా అవి విడుదలకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకే భారీగా నిధులు కేటాయిస్తున్నది. ఈ కారణంగానే ఇతర పథకాలకు కోత పెడుతున్నట్టు సమాచారం. సంక్షేమ శాఖకు సంబంధించి అప్పుడప్పుడు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇస్తుందే తప్పా విడుదలకు నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో లబ్దిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తుల మీద ఆధారపడ్డ వృత్తి దారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వృత్తుల ఆధునీకరణకు డబ్బులు లేకపోవడంతో ఇతర కూలీ పనులకు వెళ్లుతున్నారు. స్వయం ఉపాధి పనుల కింద ఇచ్చే రుణాలు ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లుతున్నారు.

Related Posts