డిగ్రీ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా
హైద్రాబాద్, ఫిబ్రవరి 5
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మేనేజ్మెంట్ కోటా అమలు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలి తాజాగా ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్రంలో మొత్తం 955 డిగ్రీ కాలేజీలుంటే, వీటిలో 3.66 లక్షలకు పైగా సీట్లున్నాయి. వాటిలో 804 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దోస్త్ పరిధిలో కొనసాగుతున్నాయి. అయితే సీట్లన్నింటినీ ప్రభుత్వమే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్తెలంగాణ (దోస్త్) ద్వారా భర్తీ చేస్తోంది. దీంతో కొన్నేండ్లుగా మేనేజ్మెంట్ కోటాను ప్రవేశపెట్టాలని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.ఈ నేపథ్యంలో 2020–21 విద్యాసంవత్సరానికి అన్ని కాలేజీల్లో 30శాతం సీట్లను మేనేజ్మెంట్, 70 శాతం కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేసుకునేలా అవకాశమివ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. అయితే మేనేజ్మెంట్ కోటా ఇవ్వడం వల్ల సర్కారు వచ్చే నష్టమేమీ ఉండదు కాబట్టి, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు అంగీకరించే చాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఒకేసారి 30 శాతం మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తుందా లేక, కొంతశాతం తగ్గిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా...
మరో వైపు రాష్ట్రంలోని ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల నిబంధనలను జేఎన్టీయూ మరింత కఠినం చేసింది. వర్సిటీ ఆదేశాలను పాటించని కాలేజీల గుర్తింపు రద్దుచేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి వర్సిటీ విడుదలచేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఈ వివరాలు వెల్లడించింది. వర్సిటీ అధికారుల తనిఖీల్లో ఏ తప్పు బయటపడ్డా మేనేజ్మెంట్లదే బాధ్యతని స్పష్టంచేసింది. జేఎన్టీయూ పరిధిలో 300లకు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నాయి. వీటిలో పలు కాలేజీలు ఏఐసీటీఈ, పీసీఐ, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడంలేదు. ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిచేసినా కాలేజీలు అమలు చేయడంలేదు. దీంతో ఈ ఏడాది విధిగా బయోమెట్రిక్ అటెండెన్స్మెయింటెన్ చేసిన కాలేజీలకు మాత్రమే గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది. ఫ్యాకల్టీ సర్టిఫికెట్లను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్లదేనని పేర్కొంది. వర్సిటీ అధికారుల తనిఖీలలో ఫ్యాకల్టీ సర్టిఫికెట్లు ఫేక్అని తేలితే ఆయా కోర్సులను రద్దు చేస్తామని తెలిపింది. ఎకడమిక్ ఇయర్ మధ్యలో ఫ్యాకల్టీ మానేస్తే.. 15 రోజుల్లోగా కొత్తవారిని తీసుకుని, ఆ వివరాలను వర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఫ్యాకల్టీకి రెగ్యులర్గా జీతాలివ్వాలని, యూజీసీ సూచించిన సర్టిఫికెట్లు మినహా ఇతర సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకోవద్దని తెలిపింది. ఆన్లైన్ ఫిర్యాదులను వారంలో పరిష్కరించాలని, గవర్నింగ్ బాడీల సమావేశం రెగ్యులర్గా నిర్వహించాలని పేర్కొంది.ఈ విద్యాసంవత్సరం కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకే అనుమతించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) కోర్సు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని కాలేజీలకూ అనుమతివ్వనున్నట్లు వర్సిటీ తెలిపింది. వచ్చే ఏడాది ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ అండ్ఇంజనీరింగ్ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో యూజీ కోర్సుల సంఖ్య 22 నుంచి 26కు పెరిగింది. ఎంఫార్మసీలోనూ ఫార్మసీ ప్రాక్టిస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు